Begin typing your search above and press return to search.

ఢిల్లీలో చక్రం తిప్పిన నేత.. ఇప్పుడిలా.?

By:  Tupaki Desk   |   13 July 2019 4:30 AM GMT
ఢిల్లీలో చక్రం తిప్పిన నేత.. ఇప్పుడిలా.?
X
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి... ఢిల్లీలో చక్రం తిప్పిన నేత మధుయాష్కీ. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ లో సీనియర్ గా ఎదిగారు. ఢిల్లీలో పరపతి సంపాదించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

నిజామాబాద్ లో తిరుగులేని నేతగా 2014కు ముందు వరకు వెలుగు వెలిగిన నేత.. తెలంగాణ ఏర్పడ్డాక మాత్రం ఇప్పుడు ఉనికిలేని స్థితికి చేరుకున్నారు. దీనికి అంతటికి కారణం నిజామాబాద్ లో ఎంపీ కవిత పోటీ చేయడమే. ఆ తర్వాత నుంచి మధుయాష్కీ పతనం ప్రారంభమైంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీచేయడం.. భారీ మెజార్టీతో గెలవడంతో ఇక 2014లో మధుయాష్కీకి ఓటమి ఎదురైంది. ఇక ఆ తర్వాత 2019 వచ్చే సరికి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ లో రైతుల సమస్యలు తీర్చలేదని వారంతా రోడ్డెక్కారు. నిజామాబాద్ ఎంపీ కవితపై ఆగ్రహం పెల్లుబుకారు. కవితను ఓడించడానికి ఏకంగా 183మంది రైతులు పోటీచేశారు.

అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నేతలు - కార్యకర్తలు గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మధుయాష్కీని పక్కనపెట్టి బలమైన బీజేపీ అభ్యర్థి అరవింద్ కు ఓటేశారు. ఆయనను గెలిపించారు. సీఎం కేసీఆర్ కూతురు కవితనే ఓడించారు. ఇప్పుడు కవిత సైలెంట్ అయిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మధుయాష్కీకి కేవలం 69వేల ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా కవితను ఓడించాలని బీజేపీ అభ్యర్థికి ఇక్కడే ఓటేసినట్టు సమాచారం..

దీంతో వరుసగా రెండు సార్లు ఓడిపోయిన మధుయాష్కీ ఇప్పుడు నిజామాబాద్ లో ఇంతవరకు అడుగుపెట్టలేదట. ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి ఎన్నికల వేళ భువనగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. గెలిచిన కోమటిరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటే మధుయాష్కీ భువనగిరిని ఎంచుకునే అవకాశాలున్నాయి. ఇలా మధుయాష్కీకి నమ్మిన నిజామాబాద్ షాక్ ఇవ్వగా ఎక్కడా పోటీచేయలో తెలియని స్థితిని ఎదుర్కొంటున్నారు.