Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్ కు షాక్ - టీపీసీసీకి కొత్త అధ్య‌క్షుడు!

By:  Tupaki Desk   |   2 Jan 2019 8:26 AM GMT
ఉత్త‌మ్ కు షాక్ - టీపీసీసీకి కొత్త అధ్య‌క్షుడు!
X
ఇటీవ‌లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు కాంగ్రెస్ కు తీవ్ర నిర్వేదాన్ని మిగిల్చాయి. ఆ పార్టీలోని జానారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాత్రం స్వ‌ల్ప మెజారిటీతో గ‌ట్టెక్కారు. అయితే - పార్టీకి దారుణ‌ ప‌రాభ‌వం ఎదురైన‌ నేప‌థ్యంలో ఉత్త‌మ్ ను టీపీసీసీ అధ్య‌క్ష పీఠం నుంచి త‌ప్పించాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాక‌పోతే గాంధీభ‌వ‌న్ లో తిరిగి అడుగుబెట్ట‌బోనంటూ ఎన్నిక‌ల‌కు ముందు ఉత్త‌మ్ శ‌ప‌థం చేశారు. ఇటీవ‌ల ఆ మాట త‌ప్పారు. కాంగ్రెస్ ఓడిపోయిన‌ప్ప‌టికీ గాంధీభ‌వ‌న్ వెళ్లి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. అయితే - ఉత్త‌మ్ పై త్వ‌ర‌లో వేటు ప‌డ‌బోతున్న‌ట్లు తాజాగా వార్త‌లొస్తున్నాయి. వ‌చ్చే ఐదేళ్ల‌పాటు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలో ఉంటుంది కాబ‌ట్టి ఆ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని నిల‌బెట్టేందుకు కొత్త నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌ని అధిష్ఠానం భావిస్తోంద‌ట‌.

ప్ర‌స్తుతం ఉత్త‌మ్ కు ప్ర‌త్యామ్నాయాన్ని కాంగ్రెస్ అన్వేషిస్తోంద‌ని.. ప్ర‌ధానంగా మ‌ధుయాస్కీ, రేవంత్ రెడ్డిల పేర్ల‌ను టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి ప‌రిశీలిస్తోంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఈ ఇద్ద‌రిలో మ‌ధుయాస్కీకే అవ‌కాశాలు ఎక్కువ‌ని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం కాంగ్రెస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నుంచి బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఓట‌మి పాలైన నేత‌ను నాయ‌కుడిగా నియ‌మిస్తే కార్య‌క‌ర్త‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని కాంగ్రెస్ భావిస్తోంద‌ట‌.

అందుకే మ‌ధుయాస్కీ వైపు కాంగ్రెస్ మొగ్గుచూపుతోంద‌ట‌. యాస్కీ సీనియ‌ర్ నేత‌. గ‌తంలో నిజామామాద్ ఎంపీగా ప‌నిచేశారు. ఏఐసీసీ కార్య‌ద‌ర్శిగానూ విధులు నిర్వ‌ర్తించారు. మంచి వాగ్దాటి ఆయ‌న సొంతం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆయ‌నైతేనే టీఆర్ ఎస్ కు ఎదురొడ్డి తెలంగాణ‌లో పార్టీని కాపాడ‌గ‌ల‌డ‌ని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంద‌ట‌. అయితే - ఇప్ప‌టికిప్పుడే టీపీసీసీ అధ్య‌క్షుణ్ని మార్చ‌క‌పోవ‌చ్చున‌ని తెలుస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాతే నాయ‌క‌త్వ మార్పు చోటుచేసుకోవ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.