Begin typing your search above and press return to search.

మోడీ మీద ఈగ వాల‌నివ్వ‌ని టాలీవుడ్ నిర్మాత‌

By:  Tupaki Desk   |   20 Dec 2017 10:54 AM GMT
మోడీ మీద ఈగ వాల‌నివ్వ‌ని టాలీవుడ్ నిర్మాత‌
X
నిజానికి ఇది చాలా చిత్ర‌మైన కాంబినేష‌న్. ఒక టాలీవుడ్ నిర్మాత ఒక సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌కు కౌంటర్ ఇవ్వడమా? ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌లేద‌నే చెప్పాలి. ఒక‌వేళ‌ నిర్మాత క‌మ్ రాజ‌కీయ నేత అయిన‌ప్ప‌టికీ ఆచితూచి మాట్లాడ‌ట‌మే కానీ.. తొంద‌ర‌ప‌డి వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌ల దాడి చేయ‌టం ఉండ‌దు. ఇప్పుడా కొర‌త‌ను తీర్చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డి.

సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా మొద‌లెట్టి త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా.. డిస్ట్రిబ్యూట‌ర్ గా.. నిర్మాత‌గా ఒక‌టి త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా అవ‌తారాలు మారుస్తున్న ఆయ‌న తాజాగా రాజ‌కీయాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇటీవ‌ల సినీయ‌ర్ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ పై చెల‌రేగిపోయేలా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న స‌టైర్లు మొయిన్ స్ట్రీం మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం భారీ చ‌ర్చ‌కు తెర తీసింది.

ఇంత‌కీ.. సాఫ్ట్ గా ఉన్న‌ట్లు క‌నిపించే మ‌ధుర శ్రీ‌ధ‌ర్ రెడ్డికి ప్రకాశ్ రాజ్ మీద అంత కోపం ఎందుకు వ‌చ్చింది? ఆయ‌న ఎందుకంత ఫైర్ అయ్యారంటే.. ప్ర‌ధాని మోడీని విమ‌ర్శించార‌ని. మోడీని విమ‌ర్శిస్తేనే.. సోష‌ల్ మీడియాలో దుమ్ము దులిపేస్తారా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వ‌స్తున్నంత‌నే మ‌రోసారి త‌న మాట‌లు ఎంత క‌టువుగా ఉంటాయో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కు పెట్టారు.

ఇటీవ‌ల వెలువ‌డిన గుజ‌రాత్‌.. హిమాచల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీపై విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై మ‌ధుర‌ శ్రీ‌ధ‌ర్ తాజాగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో త్వ‌ర‌గా ప్ర‌మోష‌న్ సాధించ‌టానికి మోడీని విమ‌ర్శించ‌టం మొద‌లెట్టార‌న్నారు. ఇదే ట్రెండ్ 2019 ఎన్నిక‌ల నాటికి దేశ‌మంతా వ్యాపిస్తుందంటూ రేవంత్ తీరును త‌ప్పు ప‌ట్టారు.

ట్వి్ట్ట‌ర్ ద్వారా రేవంత్ ను త‌ప్పు ప‌ట్టిన మ‌ధుర శ్రీ‌ధ‌ర్‌.. ఈ మ‌ధ్య‌న ప్ర‌కాశ్ రాజ్ పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ ప్రకాశ్ రాజ్ అన్న‌దేమ‌న్న‌ది చూస్తే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ పెద్ద‌లు 150+ సీట్లలో గెలుస్తామ‌ని ఢంకా బ‌జాయించార‌ని.. మ‌రిప్పుడు 150 సీట్లు ఎక్క‌డ‌? అంటూ ప్ర‌శ్నించారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 99 సీట్ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు.

ఈ మాత్రం దానికే మ‌ధుర‌శ్రీ‌ధ‌ర్ చెల‌రేగిపోయారు. నీ గోల ఎంటో అస్స‌లు అర్థం కావ‌టం లేదు.. నీ అహంకారంతో ప్రొడ్యూస‌ర్ల‌ను.. డైరెక్ట‌ర్ల‌ను ఇబ్బంది పెడుతుంటావు క‌దా.. నువ్వు సంతోషంగా ఉన్నావా? కేవ‌లం హెడ్ లైన్స్ లో ఉండాల‌ని ప్ర‌య‌త్నించ‌కు.. స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ్ ప్రభావ‌వంత‌మైన నాయ‌కుడిగా ఎదుగు.. అప్పుడు ఎదుటివారిపై కామెంట్లు చేయ్ అంటూ మండిప‌డ్డారు.

మొన్న ప్ర‌కాశ్ రాజ్‌.. నేడు రేవంత్‌.. చూస్తుంటే.. మోడీ మీద ఈగ వాలినా బీజేపీ నేత‌లు ఒకే అంటారేమో కానీ.. మ‌ధుర శ్రీ‌ధ‌ర్ ఈగ రెక్క సైతం మోడీకి ద‌గ్గ‌ర‌కు వెళ్లిగా భ‌రించేట‌ట్లు లేదుగా? ఇంత‌కీ.. అంద‌రి ఆవేశాన్ని ప్ర‌శ్నిస్తున్న మ‌ధుర‌కు ఉన్న‌ట్లుండి ఇంత ఆవేశం ఎందుకో..?