Begin typing your search above and press return to search.

అరే..దానికే గుండె బ‌ద్ధ‌లైతే..ఆంధ్రోళ్ల మాటేంది?

By:  Tupaki Desk   |   25 Dec 2018 5:18 AM GMT
అరే..దానికే గుండె బ‌ద్ధ‌లైతే..ఆంధ్రోళ్ల మాటేంది?
X
విన్నంత‌నే నిజ‌మే క‌దా? అనిపిస్తాయి. కానీ.. కాస్త త‌ర్కంగా ఆలోచిస్తే.. అరే.. దీనికే ఆగ‌మ‌వుతున్నారు?.. మ‌రి ఆ సంగ‌తేంటి? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కీ అది ఏమిటి? అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత కొలువు తీరిన అసెంబ్లీలో మొట్ట‌మొద‌టి అసెంబ్లీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించి చ‌రిత్ర‌లో నిలిచిపోయిన సిరికొండ మ‌ధుసూద‌నాచారి మాట‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

ఆయ‌న ఆవేద‌న‌కు అంద‌రూ అయ్యో అనుకునే ప‌రిస్థితి. అయితే.. ఇలా అనే వారంతా గ‌తాన్ని మ‌ర్చిపోవ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వ‌స్తోంది. అంతేనా.. అరే..దీనికే మీరింత ఆగ‌మైతే.. మ‌రి ఆంధ్రోళ్ల మాటేంది భ‌య్ అన్న సందేహం మ‌న‌సులోకి రాక మాన‌దు. ఆ మ‌ధ్య‌న కేసీఆర్ తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌ది జిల్లాలుగా ఉన్న తెలంగాణ‌ను ఏకాఏకిన ధ‌ర్టీ ప్ల‌స్ జిల్లాలుగా మార్చ‌టం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ.. ప‌లుచోట్ల మ‌రిన్ని కొత్త జిల్లాల కోసం డిమాండ్లు పెద్ద ఎత్తున తెర మీద‌కు రావ‌టం తెలిసిందే. ఈ జిల్లాల ప్ర‌క‌ట‌న తెలంగాణ‌లోని ప‌లువురిని సంతృప్తికి గురి చేయ‌లేదు. మ‌రిన్ని జిల్లాల్ని ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ రావ‌ట‌మే కాదు.. ఆ దిశ‌గా భారీ ఎత్తున ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఈ మ‌ధ్య‌నే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రెండు కొత్త జిల్లాల‌కు హామీ ఇవ్వ‌టం తెలిసిందే.

ఊహించిన దాని కంటే ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న జోష్ లో ఉన్న కేసీఆర్‌.. ఎన్నిక‌ల వేళ తానిచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. దీనిపై తాజాగా మాజీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల్లో ఓడిన వేళ కూడా తానింత‌గా బాధ ప‌డ‌లేద‌ని.. కానీ తాను తీసుకొచ్చిన జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా ముక్క‌లు అవుతుంద‌న్న వార్త వింటున్న కొద్దీ త‌న గుండె ముక్క‌లైంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కంట‌త‌డి పెట్ట‌టం గ‌మ‌నార్హం. ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న వేదిక మీద‌నే క‌న్నీరు కార్చ‌టంతో.. ఆయ‌న అభిమానులు.. పార్టీ నేత‌లు తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు.

స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలోప్ర‌జ‌ల‌కు సేవ‌కుడిగా ప‌ని చేసినా.. తాను ఓట‌మిపాలు కావ‌టం మ‌న‌సును క‌లిచివేసేలా చేసింద‌న్నారు. రాష్ట్రానికి తొలి స్సీక‌ర్ అయినప్ప‌టికీ నిత్యం తాను ప్ర‌జ‌ల్లోనే ఉన్నాన‌ని.. జీవితాన్ని.. శ‌రీరాన్ని.. ప‌లుకుబ‌డిని.. ప‌నిత‌నాన్నిప‌ణంగా పెట్టి రాష్ట్రంలోని 31 జిల్లాల కంటే మిన్న‌గా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాను చేయాల‌ని తాను త‌పించిన‌ట్లు చెప్పారు.

ఇందులో భాగంగా వేలాది కోట్లు తీసుకొచ్చి ఖ‌ర్చు చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. గ‌ట్టిగా రెండున్న‌రేళ్ల వ‌య‌సు లేని కొత్త జిల్లా మీద ఇంత అటాచ్ మెంట్ ఉంటే.. ఒక రాష్ట్రంగా ఆర‌వై ఏళ్లు ఉన్న వారి మాటేమిటి? ఇప్పుడు ముక్క‌లు చెక్క‌లు అవుతున్న జిల్లాల విష‌యంలో త‌న వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి మాజీ స్పీక‌ర్ బ‌ర‌స్ట్ కావ‌టం గ‌మ‌నార్హం. తాము ఏర్పాటు చేసుకున్న కొత్త జిల్లా కూడా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నుంచి ముక్క చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ గా ఉండాల‌న్న ల‌క్ష‌లాది మంది ఆశ‌ల్ని తుంచేస్తూ.. కొత్త జిల్లాగా ఏర్పాటు చేసుకున్న సిరికొండ‌కు కొత్త జిల్లాగా ముక్క‌ల‌వుతున్న వైనం ఆయ‌న హృద‌యాన్ని బాధించిన‌ట్లు చెబుతున్నారు.

జిల్లా ముక్క‌లు అయితేనే ఇంత బాధ ఉంటే.. మ‌రి రాష్ట్రం ముక్కలైన‌ప్పుడు ఆంధ్రోళ్ల బాధ‌.. వారి గుండెకోత సిరికొండ దొర‌వారికి ఇప్ప‌టికైనా అర్థ‌మై ఉంటుందంటారా? ఇక్క‌డ జిల్లా మాత్ర‌మే ముక్క‌లైంది. కానీ.. తెలంగాణ ఏర్ప‌డే వేళ‌.. ఆంధ్రోళ్ల మీద నింద‌లు కూడా ప‌డ్డాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎప్పుడైనా స‌రే.. తాము బాగా ప్రేమించేది ముక్క‌లైతే ఎంత ఆవేద‌న ఉంటుందో.. సిరికొండ సారు వారికి ఇప్ప‌టికి అర్థ‌మైంది.