Begin typing your search above and press return to search.

సుప్రీం నోటీసుల్ని టీ స్పీకర్ తీసుకుంటారా?

By:  Tupaki Desk   |   20 Aug 2016 10:30 PM GMT
సుప్రీం నోటీసుల్ని టీ స్పీకర్ తీసుకుంటారా?
X
ఫిరాయింపుల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ స్పీకర్ కు లేనిపోని తిప్పల్ని తెచ్చి పెడుతోంద. అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయం ఫైనల్ అయినా వాస్తవంలో స్పీకర్ కు ఉండే పరిమితులు తెలియంది కాదు. అలా అని ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి. పైకి చెప్పుకోలేని విధంగా ఉండే పరిస్థితుల నేపథ్యంలో ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ స్పీకర్ తర్జనభర్జనలుపడుతున్నారు. ఈ పరిస్థితిని విపక్షాలు ఏ మాత్రం అర్థం చేసుకోకుండానే.. సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. కోర్టు తెలంగాణ స్పీకర్ కునోటీసులు జారీ చేయటం తెలిసిందే.

సుప్రీంకోర్టు నుంచి వచ్చిన నోటీసుల్ని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి తీసుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన నోటీసుల్ని తెలంగాణ స్పీకర్ స్వీకరించకుండా వెనక్కి తిప్పి పంపటం తెలిసిందే. కానీ.. అదే తీరును సుప్రీంకోర్టు విషయంలో చేస్తే లేనిపోని తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు టీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం.

ఫిరాయింపుల అంశంపై సుప్రీం పంపే నోటీసుల్ని తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై తెలంగాణ ఏజీతో స్పీకర్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నోటీసులు తీసుకోకుండా ఉండటం ఏ మాత్రం సరికాదని.. సుప్రీం పంపిన నోటీసుల్ని తీసుకొని.. అందులోని సారాంశానికి తగినట్లుగా సమాధానాన్ని సిద్ధం చేసి పంపితే బాగుంటుందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. ఫిరాయింపులపై పదో షెడ్యూల్ లో పేర్కొన్న నియమావళి ప్రకారం.. స్పీకర్ కు కచ్ఛితమైన గడువును పెట్టలేదని.. ఈ నేపథ్యంలో అనర్హతల విషయం తాను నిర్ణయం తీసుకోలేదన్న మాటను సుప్రీంకు చెబితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అనర్హతలపై నిర్ణయం తీసుకోవటానికి నిర్దిష్టమైన గడువు స్పీకర్ కు ఏమీ లేదన్న అంశాన్ని చూపించటం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసు నుంచి ఎలాంటి వివాదం లేకుండా బయటపడే అవకాశం ఉందన్న మాట చెబుతున్నారు. అయితే.. ఇదంతా లోగుట్టుగా జరుగుతున్న తంతు కావటంతో.. అధికారికంగా ఈ అంశంపై తెలంగాణ స్పీకర్ ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.