Begin typing your search above and press return to search.

మేము ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేదు.. ఏదో బండి లాగిస్తున్నాం!

By:  Tupaki Desk   |   17 Aug 2022 8:30 AM GMT
మేము ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేదు.. ఏదో బండి లాగిస్తున్నాం!
X
ద‌క్షిణ భార‌త‌దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం.. క‌ర్ణాట‌క‌. వ‌చ్చే ఏడాది మేలోగా క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బీజేపీ నేత‌లు ఆ పార్టీని ఇర‌కాటంలో ప‌డేస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా క‌ర్ణాట‌క న్యాయ శాఖ మంత్రి మ‌ధుస్వామి మాట‌లు అని చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సంచ‌ల‌నంగా మారింది.

ఆ ఆడియో క్లిప్ ప్ర‌కారం.. తాము ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేద‌ని.. ఏదో బండి లాగిస్తున్నాం అని మంత్రి మ‌ధుస్వామి వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు ఈ ఆడియో విప‌క్షాల‌కు అస్త్రంగా మారింది. మంత్రి మధుస్వామి వెంట‌నే రాజీనామా చేయాల‌ని కాంగ్రెస్, జేడీఎస్ త‌దిత‌ర పార్టీలు డిమాండ్ చేశాయి. చెన్న‌ప‌ట్నానికి చెందిన భాస్క‌ర్ అనే ఒక సామాజిక కార్య‌క‌ర్త‌తో మాట్లాడుతూ మంత్రి మ‌ధుస్వామి ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు క‌ర్ణాట‌క అంతా వైర‌ల్ గా మారాయి.

మంత్రి మ‌ధుస్వామికి సామాజిక కార్య‌క‌ర్త భాస్క‌ర్ ఫోన్ చేసి రైతు స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఓ స‌హ‌కార బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి మ‌ధుస్వామి.. మేము ఏడెనిమిది నెలలుగా ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేదు.. ఏదో అలా లాక్కొస్తున్నామంతే అని పేర్కొన్నారు.

మీ ఫిర్యాదును స‌హ‌కార శాఖ మంత్రి సోమ‌శేఖ‌ర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని.. ఆయ‌న చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.. ఏం చేద్దామ‌ని మ‌ధుస్వామి తెలిపారు.

ఈ వ్యాఖ్య‌లు క‌ర్ణాట‌క అంతా వైర‌ల్ కావ‌డంతో మంత్రి సోమ‌శేఖ‌ర్.. మ‌ధుస్వామిపై నిప్పులు చెరిగారు. మ‌ధుస్వామి తానే తెలివైన‌వాడిని అనుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే మ‌రో మంత్రి మునిర‌త్న కూడా మ‌ధుస్వామిపై మండిప‌డ్డారు. మ‌ధుస్వామి త‌క్ష‌ణం మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ త‌ల‌ప‌ట్టుకుంది. మంత్రుల మ‌ధ్య స‌యోధ్య‌కు ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మైని రంగంలోకి దించారు.

మ‌రోవైపు ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారితే రాజీనామాకు సిద్ధమని మధుస్వామి చెబుతున్నారు. సీఎంకు, పార్టీకి మేలు జరుగుతుందనుకుంటే సంతోషంగా రాజీనామా చేస్తానని అంటున్నారు.