Begin typing your search above and press return to search.

బట్టలు విప్పించి డ్రాయ‌ర్ల‌పై నిల‌బెట్టిన పోలీసులు

By:  Tupaki Desk   |   4 Oct 2017 4:37 PM GMT
బట్టలు విప్పించి డ్రాయ‌ర్ల‌పై నిల‌బెట్టిన పోలీసులు
X
త‌మ‌ది రైతు సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పుకొంటున్న బీజేపీకి త‌మ ఏలుబ‌డి ఉన్న రాష్ర్టాల‌లోనే తీవ్ర విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డే ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ పాలిత రాష్ట్రమైన మ‌హారాష్ట్ర - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనే మ‌రో ఘోరం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ లోని టికంగఢ్‌ లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. రైతుల దుస్తులను ఊడదీసి మరీ కొట్టారు. ఈ వార్త జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం రేపిన నేప‌థ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో తీవ్ర కరువు ప్రాంతమైన బుందేల్‌ ఖండ్‌ లో రైతులు తమ డిమాండ్లను ప్రభుత్వ అధికారుల ముందు ఉంచేందుకు జిల్లా కార్యాలయం ముందు నిరసనకు దిగారు. రైతుల నిరసన కాస్త ఉద్రిక్తతంగా మారడంతో.. వారిపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. టియర్ గ్యాస్ - వాటర్ కెనాన్స్ ఉపయోగించారు. అరెస్టు చేసిన రైతులను పోలీసు స్టేషన్‌ కు తరలించారు పోలీసులు. రైతులందరిచే బట్టలు విప్పించిన పోలీసులు కొన్ని గంటల పాటు రైతులను కేవలం డ్రాయర్‌ పై మాత్రమే కూర్చోబెట్టారు. ఈ విధంగా ఉన్న ఫోటోలు కాంగ్రెస్ నేతలకు చిక్కాయి. దీంతో వివాదం ముదిరింది. రైతుల ఫోటోలు - ఇతర ఆధారాలతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్ర సింగ్ స్పందించారు. రైతులతో కాంగ్రెస్ నేతలే నిరసన చేయించారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుతానని ఆయన చెప్పారు. రైతులు రాళ్లు విసిరిన తర్వాతే తాము లాఠీలకు పని చెప్పాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఏడాది జూన్‌ లో రుణ మాఫీ - పంటలకు గిట్టుబాటు ధర కోరుతూ మందసోర్‌ లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు కలకలం రేపిన విషయం విదితమే. పోలీసు కాల్పుల్లో ఏడుగురు రైతులు మరణించగా,పలువురికి గాయాలయ్యాయి. పోలీస్‌ కాల్పులకు నిరసనగా మధ్యప్రదేశ్‌ అంతటా ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు అన్న‌దాత‌ల‌ ఆందోళనలతో అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్‌ లో శాంతి నెలకొనేవరకూ దీక్ష కొనసాగిస్తానన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అనూహ్యంగా ప్ర‌క‌టించారు. అంతే అనూహ్యంగా దీక్ష విరమించారు. ఆ స‌మ‌యంలోనే బుందేల్ ఖండ్‌ లో ఆందోళ‌న‌లు రావ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మధ్యప్రదేశ్‌ - ఉత్తర ప్రదేశ్‌ ల మధ్య విస్తరించిన బుందేల్‌ ఖండ్‌ ప్రాంతం కొన్ని సంవత్సరాలుగా కరువు ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో తాగు నీటి సంక్షోభం ఏర్పడింది. పశు పక్ష్యాదులు చనిపోతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా రైతుల ఉద్య‌మాలు రాజుకున్నాయి.