Begin typing your search above and press return to search.

కమల్ నాథ్ కథ 15 నెలల ముచ్చటేనా?

By:  Tupaki Desk   |   15 March 2020 7:07 AM GMT
కమల్ నాథ్ కథ 15 నెలల ముచ్చటేనా?
X
మధ్యప్రదేశ్‌ లో కమల్‌ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కథ 15 నెలలకే ముగిపోయే పరిస్థితి వచ్చింది. మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్‌ పై తిరుగుబాటు చేయడం.. బీజేపీ కండువా కప్పుకోవడం.. అతని వర్గం ఎమ్మెల్యేలు కర్ణాటకలోని బెంగళూరుకు తరలిపోవడంతో కమల్‌ నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. సింధియాకు మద్దతునిచ్చిన ఆరుగురు మంత్రులను సీఎం కమల్‌ నాథ్ విజ్ఞప్తి మేరకు గవర్నర్ లాల్‌ జీ టాండన్ తొలగించారు. శుక్రవారం గవర్నర్‌ ను కలిసి బలపరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధమేనని సీఎం తెలిపారు.

మార్చి 16న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. కాబట్టి 16వ తేదీనాడే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందిగా స్పీకర్‌ ను సీఎం కమల్‌ నాథ్ కోరారు. కాగా, బీజేపీ కూడా ఇదే డిమాండ్‌ తో ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో వారం రోజులుగా సాగుతున్న మధ్యప్రదేశ్ హైడ్రామాకు ఈ నెల 16న ఫుల్‌ స్టాప్ పడనున్నట్టు తెలుస్తున్నది. 19 మంది సింధియా మద్దతు ఎమ్మెల్యేలు శుక్రవారం బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ కు తిరిగిరావల్సి ఉన్నట్టు బీజేపీవర్గాలు తెలిపాయి. కానీ, దాదాపు ఏడుగంటల తర్వాత ఈ ప్లాన్‌ లో కొత్త ట్విస్టు వచ్చింది. భోపాల్‌ కు రాకుండా ఆ ఎమ్మెల్యేలు ఎయిర్‌ పోర్టు నుంచి తిరిగి రిసార్టుకు వెళ్లినట్టు తెలిసింది.

కాగా కమల్ నాథ్ 2018 డిసెంబరు 17న మధ్య ప్రదేశ్ సీఎంగా అధికారం చేపట్టారు. బొటాబొటి మెజారిటీతో పాలన సాగిస్తున్న ఆయన ఎప్పటికైనా బీజేపీ నుంచి ముప్పు తప్పదన్న క్లారిటీతో ఉన్నప్పటికీ బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టగలనని చెప్పేవారు. కానీ, బీజేపీ ఇప్పుడు ఏకంగా జ్యోతిరాదిత్య సింధియా వంటి నాయకుడికే ఎరవేసి మొత్తం రాజకీయాన్ని మలుపు తిప్పేసింది. కమల్ నాథ్‌ని ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టేసింది. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ సీఎం పదవిని కోల్పోవాల్సిన స్థితి వచ్చింది.