Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ సిగ్నల్ కోసం జెయింట్ వీల్ ఎక్కిన మంత్రి

By:  Tupaki Desk   |   22 Feb 2021 5:31 AM GMT
సెల్ ఫోన్ సిగ్నల్ కోసం జెయింట్ వీల్ ఎక్కిన మంత్రి
X
హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ పని చేయకపోతే.. అంతకు మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. స్మార్ట్ ఫోన్ వచ్చాక.. ఫోన్ లేనిదే నిమిషం కూడా గడవని పరిస్థితి. మామూలు వారి సంగతే ఇలా ఉంటే.. రాష్ట్ర మంత్రిగా వ్యవహరించే ఒక ప్రముఖుడికి.. సరైన సమయంలో ఫోన్లో సిగ్నల్ లేకపోతే? అంతకు మించిన కష్టం మరొకటి ఉండదు కదా.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైన వేళ.. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి బ్రజేంద్ర సింగ్ కాస్త భిన్నంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగానే కాదు.. వైరల్ గా మారింది. ఇంతకూ జరిగిందేమంటే..ఒక కల్చరల్ ప్రోగ్రాంనునిర్వహించగా.. దానికి హాజరు కావాలని మంత్రిని కోరారు. దీంతో అక్కడకు వెళ్లిన మంత్రికి స్థానికులు తమ సమస్యల్ని ఏకరువు పెట్టుకున్నారు.

దీంతో.. వారి సమస్యల పరిష్కారం కోసం జేబులోని సెల్ ఫోన్ చేసి.. స్థానిక అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా సెల్ సిగ్నల్ సరిగా లేని పరిస్థితి. దీంతో.. ఏం చేయాలో పాలుపోక.. అక్కడే ఉన్న జెయింట్ వీల్ ఎక్కేశారు. పైన జెయింట్ వీల్ ను ఆపారు. సిగ్నల్ కనెక్టు కావటంతో అధికారులతో మాట్లాడారు. నేల మీద నుంచి యాభై అడుగుల ఎత్తున జెయింట్ వీల్ ను ఆపితే కానీ సిగ్నల్ కనెక్టు కాలేదట.

ఇదే సమయంలో..స్థానికుల సమస్యల పరిష్కారానికి.. జెయింట్ వీల్ ఎక్కి మరీ శ్రమపడుతున్న మంత్రివారి ఫోటోను స్థానిక పత్రికలు పబ్లిష్ చేయటంతో ఈ విషయం బయటకు రావటమే కాదు.. ఇప్పుడు వైరల్ గా మారింది. సమస్యలు విన్నంతనే వాటి పరిష్కారం కోసం ప్రయత్నిద్దామంటే సిగ్నల్ లేదని.. అందుకే అలా ఎక్కినట్లు చెప్పుకున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఈ ఉదంతంతో సదరు మంత్రివారి ఇమేజ్ భారీగా పెరిగిందని చెప్పక తప్పదు.