Begin typing your search above and press return to search.

ప్రేమికులకు మద్రాస్ హైకోర్టు రక్షణ కవచం

By:  Tupaki Desk   |   14 April 2016 5:26 AM GMT
ప్రేమికులకు మద్రాస్ హైకోర్టు రక్షణ కవచం
X
కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు మద్రాస్ హైకోర్టు రక్షణ కవచం లాంటి ఆదేశాల్ని జారీ చేసింది. కులాంతర వివాహాలు చేసుకున్న వారు పరువు హత్యలకు గురి కావటం పట్ల కోర్టు తీవ్ర అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒక లెక్క ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో 2003 నుంచి ఇప్పటివరకూ కులాంతర వివాహాలు చేసుకొని పరువు హత్యలకు గురైన వారి సంఖ్య వందగా తేలింది. అధికారికంగానే ఇంత పెద్ద సంఖ్య ఉంటే.. అనధికారికంగా వందలాది మంది ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది.

కులాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పిస్తూ.. జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో సామాజిక వర్గాల అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని.. ఆ బృందం నిరంతరం పని చేయాలని పేర్కొంది. తాము చెప్పిన తరహా బృందాల్ని మూడు నెలల లోపు ఏర్పాటు చేయాలని హైకోర్టు స్పష్టం చేయటం గమనార్హం. గతంలో జరిగిన ఒక కులాంతర వివాహానికి సంబంధించి చోటు చేసుకున్న పరువు హత్యకు సంబంధించిన విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది.

అంతేకాదు.. కులాంతర వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామని.. కోర్టు రక్షణ కవచంగా నిలుస్తుందన్న రీతిలో తాజా ఆదేశాలు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే ఆ దంపతులు కానీ తమ రక్షణకు సంబంధించి పోలీసులను ఆశ్రయిస్తే వారి పూర్తి బాధ్యత.. త్వరలో ఏర్పాటు చేసే సామాజిక బృందాలదేనని స్పష్టం చేయటంత పాటు.. సదరు దంపతుల వివరాల్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందుపర్చాలని పేర్కొంది. ప్రేమికులకు అండగా నిలిచే విభాగానికి అవసరమైన నిధులను కేటాయించాలి.. వారికి అవసరమైన తాత్కాలిక నివాస గృహాల్ని ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.

ప్రేమికులకు రక్షణగా నిలవటంతోపాటు.. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల తరఫు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపటం.. వారికి కౌన్సెలింగ్ నిర్వహించటం.. వారు కానీ పెళ్లిని అంగీకరిస్తే.. వారి వెంట పంపటం లాంటి చర్యలే కాదు.. ప్రేమికుల్ని విడదీసే ప్రయత్నం చేసే వారిపై చట్టపరమైన చర్యల్ని తీసుకోవాలన్న ఆదేశాల్ని మద్రాస్ హైకోర్టు జారీ చేయటం గమనార్హం.