Begin typing your search above and press return to search.

కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు

By:  Tupaki Desk   |   15 Sep 2021 5:33 AM GMT
కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
X
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తాజాగా మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ నిర్ణయించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైవేలు.. ఎక్స్ ప్రెస్ హైవేల మీద గంటకు ఎంత వేగంతో ప్రయాణించాలన్న దానిపై కేంద్రం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టటం గమనార్హం. ఇంతకూ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నదన్నది చూస్తే.. 2013లో కాంచీపురం సమీపంలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒక డెంటల్ డాక్టర్ మరణించారు.

దీనికి సంబంధించిన కేసులో కింది కోర్టు ఇచ్చిన నష్టపరిహారాన్ని పెంచాలని అభ్యర్థిస్తూ ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తుల ధర్మాసనం.. గతంలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ ప్రెస్ హైవేల మీద గంటకు 120 కిలోమీటర్ల వేగంతో..జాతీయ రహదారులపై గంటకు 100కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా 2018లో కేంద్రం ఒక ఉత్తర్వును జారీ చేసింది.

దీన్ని కొట్టేసిన మద్రాస్ హైకోర్టు.. తాజాగా కేంద్రం జారీ చేసిన ఉత్తర్వును పున: పరిశీలించాలని పేర్కొంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వేగ నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. దేశంలో మరే ప్రాంతంలో అయినా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలన్న నియమం ఉన్నప్పుడు.. గంటకు 200 నుంచి 300 వరకు వేగంతో ప్రయాణించే కార్లను ఎలా అనుమతులు ఇస్తున్నట్లు?

ఒకవేళ.. అలాంటి కార్లు అయినా.. స్పీడ్ లిమిట్ విధించేలా మార్పులు చేసి మాత్రమే అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? అన్నది ప్రశ్నగా మారింది. ఫలానా వేగానికి మించి వెళ్లకూడదన్న రూల్ ఉన్నప్పుడు.. అంతే వేగానికి పరిమితి విధించేలా వాహన కంపెనీలకు పరిమితులు ఎందుకు విధించకూడదు? అన్నది ప్రశ్న. మరి.. దీనికి సమాధానం చెప్పేవారెవరు?