Begin typing your search above and press return to search.

పెప్సీ, కోక్ కు పెద్ద రిలీఫ్ ద‌క్కింది

By:  Tupaki Desk   |   2 March 2017 4:15 PM GMT
పెప్సీ, కోక్ కు పెద్ద రిలీఫ్ ద‌క్కింది
X
బ‌హుళ‌జాతి సాఫ్ట్‌ డ్రింక్ కంపెనీలయిన‌ పెప్సీ - కోక్‌ల‌కు ఊర‌ట క‌లిగించే తీర్పును మ‌ద్రాస్ హైకోర్టు వెలువ‌రించింది. త‌మిళ‌నాడులోని త‌మిర‌ప‌ర‌ణి న‌ది నీళ్ల‌ను పెప్సీ, కోక్ వాడుకోవ‌చ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఆ రెండు సంస్థ‌లు ఈ నీటిని వాడుకోవడాన్ని వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌లు రేగ‌డంతో నాలుగు నెల‌ల కింద‌ట ఆ న‌ది నీళ్లు వాడకుండా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెప్సీ, కోక్ ఆ నీటిని వాణిజ్య ల‌బ్ధి కోసం వాడుకోవ‌డం వ‌ల్ల వేల మంది రైతుల‌కు న‌ష్టం వాటిల్లుతున్న‌ద‌ని పిటిష‌న‌ర్ వాదించారు. అయితే తాము కేవ‌లం మిగులు జ‌లాల‌ను మాత్ర‌మే వాడుకుంటామ‌ని ఆ సంస్థ‌లు కోర్టుకు తెలిపాయి. త‌మిళ‌నాడు రాష్ట్ర‌వ్యాప్తంగా పెప్సీ, కోక్‌ల‌ను రిటెయిల‌ర్లు నిషేధించిన మ‌రుస‌టి రోజే ఈ కోర్టు తీర్పు రావ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తితో రైతుల‌కు న‌ష్టం చేకూర్చేలా పెప్సీ, కోక్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌దని పిటిష‌న‌ర్ త‌మిళ‌నాడు హైకోర్టుకు తెలిపారు. కేవ‌లం రూ.37కే వెయ్యి లీట‌ర్ల నీటిని ఈ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న‌ద‌ని, గ‌తంలో రోజుకు 9 ల‌క్ష‌ల నీటిని వాడుకొనేలా అనుమ‌తి ఉన్నా.. త‌ర్వాత దాన్ని రెట్టింపు చేశార‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. అయితే పెప్సీ, కోక్ సంస్థ‌ల త‌ర‌ఫున న్యాయ‌వాది దీన్ని తోసిపుచ్చారు. త‌మ‌ను కావాల‌నే లక్ష్యంగా చేసుకున్నార‌ని, తాము కూడా ప్ర‌భుత్వ పారిశ్రామిక ప‌రిధిలో భాగ‌మ‌ని, అంద‌రికీ నీళ్లు ఇచ్చిన‌ట్లే త‌మ‌కూ ఇవ్వాల‌ని వాదించాయి. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న‌ కోర్టు సంస్థ‌ల వాద‌న‌నే బ‌ల‌ప‌రిచింది. పెప్సీ, కోక్ ఉత్ప‌త్తికోసం నీటిని వినియోగించుకోవ‌చ్చున‌ని ఆదేశించింది.

ఇదిలాఉండ‌గా... త‌మిళ‌నాడు రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘమైన‌ త‌మిళ‌నాడు వానిగ‌ర్ సంగ‌మ్ పెప్సీ, కోక్‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ సంఘంలో ఆరు వేల‌కుపైగా చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా దుకాణాలు, 15 ల‌క్ష‌ల‌కుపైగా స‌భ్యులు ఉన్నారు. చిన్న‌చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ కోలాలు అమ్మ‌బోర‌ని ఆ సంఘం స్ప‌ష్టం చేసింది. పెద్ద‌పెద్ద సూప‌ర్‌మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత స‌మ‌యం కావాల‌ని అడిగినా.. తాము అంగీక‌రించ‌లేద‌ని ఆ సంఘం వెల్ల‌డించింది. గ‌త జ‌న‌వ‌రి నెల‌లో జ‌ల్లిక‌ట్లు కోసం జ‌రిగిన ఉద్య‌మం సంద‌ర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఎంఎన్‌సీ సాఫ్ట్‌ డ్రింక్స్ వ‌ల్ల స్థానిక త‌యారీదారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని, ఈ విదేశీ సంస్థ‌లు విలువైన నీటి సంప‌ద‌ను కూడా దోచుకుంటున్నాయ‌ని సంఘం ఆరోపించింది. రాష్ట్రం క‌రువు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంఎన్‌సీ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు నీటిని దోచుకోవ‌డాన్ని అడ్డుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలో తాము ఓ ముంద‌డుగు వేసిన‌ట్లు వివ‌రించారు. ఈ క్ర‌మంలో తాజా తీర్పు ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/