Begin typing your search above and press return to search.

లోక్ సభ సీట్ల తగ్గింపు.. కేంద్రంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

By:  Tupaki Desk   |   23 Aug 2021 3:06 AM GMT
లోక్ సభ సీట్ల తగ్గింపు.. కేంద్రంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
X
జనాభా తగ్గిందన్న కారణాన్ని చూపించి.. రాష్ట్రాల లోక్ సభ సీట్లను తగ్గించే అంశంలోని ఔనత్యం ఎంతన్న ప్రశ్నను కేంద్రాన్ని సూటిగా సంధించిన అంశం తాజాగా మద్రాస్ హైకోర్టులో చోటు చేసుకుంది. 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు దక్షిణ భారతానికి చెందిన కొన్ని లోక్ సభ స్థానాల్ని కోల్పోవాల్సి వచ్చింది. అందులో తమిళనాడుకు రెండు.. ఉమ్మడి ఏపీ రెండు లోక్ సభ స్థానాల్ని కోల్పోయింది. అంతేకాదు.. ఆ తర్వాత చేపట్టే పునర్ వ్యవస్థీకరణలో ఆ రాష్ట్రాలు మరిన్ని లోక్ సభ సీట్లు కోల్పోయే ప్రమాదం రావటం తెలిసిందే.

ఈ నేపత్యంలో పునర్విభజనపై 2001 వరకు నిషేధం విధించారు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు రియాక్టు అయ్యింది. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేసింది. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లోక్ సభలో ప్రాతినిధ్యం తగ్గించటం ఏమిటంటూ కేంద్రాన్ని నిలదీసింది. అంతేకాదు.. తగ్గించిన సీట్లను పునరుద్ధరిస్తారా? లేదంటే నష్టపరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని పేర్కొంది. ఈ వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసినట్లే. అయితే ఇదంతా ఆగస్టు 17న జరిగినప్పటికి.. వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి.

జస్టిస్ ఎస్‌.కృపాకరన్‌, జస్టిస్‌ పి.పుగళేందితో కూడిన ధర్మాసనం తాజాగా కేంద్రానికి తమ ఆదేశాల్ని పంపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆదేశాలు పంపిన న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎస్‌.కృపాకరన్‌ ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. 1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్ సభ స్థానాల సంఖ్యను 505 నుంచి 520కు పెంచారు. జనాభా తగ్గిందని తమిళనాడుకు ఉన్న 41 లోక్ సభ సీట్లను 39కు తగ్గిస్తే.. ఉమ్మడి ఏపీ సీట్లను43 నుంచి 41కు తగ్గించారు. కాకుంటే.. 1977లో మళ్లీ 42కు పెంచారు.

జనాభాను విజయవంతంగా నియంత్రించినందుకు ఏమ్మడి ఏపీ.. తమిళనాడు రాష్ట్రాలు రెండేసి స్థానాల్ని కోల్పోయిన వైనాన్ని గురతు చేస్తూ.. జనాభా నియంత్రణను సరిగా అమలు చేయని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. అవసరమైతే అధిక రాజ్యసభ సీట్లు ఇవ్వాలంది. 1967 నుంచి ఇప్పటివరకు 14 ఎన్నికలకు 28 స్థానాల్ని కోల్పోయినందుకు తమిళనాడుకు రూ.5600 కోట్ల8 పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

జనాభా మార్పుతో సంబంధం లేకుండా లోక్ సభలో నియోజకవర్గాల్ని ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని81వ అధికరణను సవరించేందుకు వీలవుతుందో లేదో కూడా కేంద్రం పరిశీలించాలని పేర్కొంది. దీనికి సంబంధించి నాలుగువారాల్లో కేంద్రాన్ని కౌంటర్ వేయాలని పేర్కొంది. కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభలో వెయ్యి సీట్లు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో లోక్ సభలో కొన్ని రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని పెంచాలని పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదల నియంత్రణను విజయవంతంగా చేపట్టిన రాష్ట్రాలు లోక్ సభలో తమ ప్రాతినిధ్యం తగ్గించేలా కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త చర్చ ఖాయమన్న మాట వినిపిస్తోంది.