Begin typing your search above and press return to search.

సీఎంకు సపోర్టుగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   10 Dec 2021 8:30 AM GMT
సీఎంకు సపోర్టుగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిసారి మాటల యుద్ధాలు నడుస్తూనే ఉంటాయి. ఏపీలో అయితే అంతకుమించిన బూతు బాగోతమే నడుస్తుంది. అయితే తమిళనాడులో సైతం కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంత మంచి పనులు చేస్తున్నా కూడా అక్కడి ప్రతిపక్షాల నేతలు నోటికి పని చెబుతూనే ఉంటాయి.

మధురైకి చెందిన సాట్టై మురుగన్ అనే నిందితుడు పదే పదే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను విమర్శిస్తుండడం.. అందులో నిజాలు లేకపోవడంతో ధర్మాసనం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించమని హైకోర్టు హెచ్చరించడం సంచలనమైంది. ఈ రకమైన హెచ్చరికలను మద్రాస్ హైకోర్టు అనుబంధ మధురై ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తమిళనాడు సీఎం స్టాలిన్ పై మధురై నివాసి సాట్టై మురుగన్ పలు ఆరోపణలు చేశాడు. నిరాధార ఆరోపణలు చేసిన అతడిపై పోలీసులు కేసునమోదు చేశారు. జామీను కోరుతూ అతడు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటీషన్ వేశాడు. ఈ పిటీషన్ ను న్యాయమూర్తి పుగళేంది విచారించారు. సీఎం స్టాలిన్ చక్కగా తన విధులను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి సీఎంను అభినందించకపోయినా ఫర్వాలేదని.. విమర్శించడాన్ని మాత్రం కోర్టు సహించదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసిందో చెప్పాలని నిందితుడిని హైకోర్టు నిలదీసింది. సీఎంను విమర్శించనని కోర్టుకు ఇచ్చిన హామీని ధిక్కరించి ఇకపై ఏ ఒక్క మాట మాట్లాడినా జామీను రద్దు చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించడం గమనార్హం. న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచేలా జడ్జి హెచ్చరికలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.