Begin typing your search above and press return to search.

హిందీలో కేంద్రం లేఖ.. తిప్పి పంపిన ఎంపీ.. రెచ్చగొడుతున్నారని వ్యాఖ్య!

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
హిందీలో కేంద్రం లేఖ.. తిప్పి పంపిన ఎంపీ.. రెచ్చగొడుతున్నారని వ్యాఖ్య!
X
గాంధీ శాంతి బహుమతికి సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి మధురై ఎంపీ వెంకటేషన్ కు కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి ఓ లేఖ వెళ్లింది. అయితే.. ఆ లేఖ హిందీలో ఉంద‌ని తిప్పి పంపారు సద‌రు ఎంపీ. గ‌తంలో ప‌లుమార్లు ఇలాగే వ్య‌వ‌హ‌రించార‌ని, ఇదంతా ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్నార‌నే సందేహం వ్య‌క్తంచేశారు మంత్రి.

ఫిబ్రవరి 27న కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ తనకు లేఖ రాశారని ఎంపీ వెంకటేషన్ తెలిపారు. అయితే.. ఆ లేఖ హిందీలో ఉండటం వల్ల అందులోని విషయం తనకు అర్థం కాలేద‌న్నారు. ఆ లేఖకి అటాచ్ చేసిన ఫార్మ్ ఇంగ్లీష్ లో ఉండటం వల్లే.. గాంధీ శాంతి బహుమతి కోసం రికమండేషన్లు పంపండని కోరినట్లు అర్థమయ్యిందని చెప్పారు. ఆ లేఖను తిరిగి సంబంధిత మంత్రిత్వశాఖకు పంపిస్తున్నానని, భవిష్యత్తులోనైనా ఇలాంటి రెచ్చగొట్టుడు పనులు చేయకూడదని సదరు మంత్రి తనశాఖ అధికారులకు సూచించాలని తాను కోరుతున్నానని అన్నారు మ‌ధురై ఎంపీ.

కాగా.. హిందీలో స‌మాచారం పంపడంపై గ‌తంలో తాను పలుసార్లు నిరసన వ్యక్తం చేసినట్లు వెంకటేషన్ తెలిపారు. ఇది అధికారిక భాష అమల చట్టానికి వ్యతిరేకమని ఆయన తెలిపారు. అంతేకాదు.. ఇదే విష‌య‌మై వెంకటేషన్ మద్రాస్ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. అప్పుడు కోర్టులో కేంద్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. భవిష్యత్తులో కమ్యూనిఖేషన్స్ ఇంగ్లీష్ లో ఉండేలా చూస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది.

విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలను ఈ గొప్ప దేశం కలిగి ఉన్న విషయాన్ని కనీసం మంత్రిత్వశాఖలోని అధికారులకు తెలిసి ఉండాలని ఎంపీ అన్నారు. కేంద్రప్రభుత్వం.. సంస్కృతం, హిందీ భాషలను.. హిందీయేతర రాష్ట్రాల్లో అమ‌లు చేయాల‌ని చూస్తోంద‌ని, మరీ ముఖ్యంగా తమిళనాడులో అమలుచేయాలని చూస్తోంద‌ని, ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే భారత ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటివి చేస్తోందా? అని ఎంపీ వెంకటేషన్ అనుమానం వ్యక్తం చేశారు.

హిందీని త‌మ‌పై బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతీసారి గట్టిగా పోరాడిన, ప్రాణాలు అర్పించిన చరిత్ర తమిళనాడుకి ఉందని ఎంపీ గుర్తు చేశారు. తమ గుర్తింపు, గొప్ప సాంప్రదాయాలను కాపాడుకునేందుకు తమిళ ప్రజలు వెనకడుగు వేయరని అన్నారు వెంక‌టేష‌న్.