Begin typing your search above and press return to search.

ఆ పాపను చూసైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిది!

By:  Tupaki Desk   |   26 April 2020 6:12 AM GMT
ఆ పాపను చూసైనా సిగ్గు తెచ్చుకుంటే మంచిది!
X
ప్రాణం ఎవరికైనా తీపే. సంక్షోభ సమయాల్లో మానవత్వాన్ని స్వార్థం డామినేట్ చేస్తే.. చెన్నైలో చోటు చేసుకున్న అమానుష ఘటనలే రిజిస్టర్ అవుతుంటాయి. కరోనా బారిన పడినోళ్లకు వైద్యం చేసి.. వారి ప్రాణాల్ని కాపాడే యత్నంలో దుర్మార్గపు వైరస్ బారిన పడిన వైద్యుడు మరణిస్తే.. వారి అంత్యక్రియల నిర్వహణకు స్థానికులు అడ్డుకున్న దారుణం చెన్నైలో చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇదే తరహా ఉదంతాలు దేశంలోని కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయి. వయసు పెరిగినా.. మనసు పెరగని ఇలాంటివారికి చెంపపెట్టుగా తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్నారి పెద్ద మనసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పెద్దోళ్లు సిగ్గుతో చితికిపోయేలా ఆమె తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులోని మధురైకి చెందిన ఒక చిన్నారి ప్రధాని మోడీకి ఒక లేఖ రాసింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ పాప.. తమకు చెందిన ఎకరం పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎందుకిలా అంటే.. కరోనా బారిన పడిన వారికి వైద్యం చేస్తున్న వైద్యుడు ఒకరు ఆ వైరస్ బారిన పడి మరణించారు.

అయితే.. ఆ వైద్యుడి అంత్యక్రియలను నిర్వహించేందుకు స్థానికులు అడ్డుకున్నారు. తమ శశ్మానంలో అంత్యక్రియల్ని నిర్వహిస్తే ఊరుకోమన్న వైనం ఆ చిన్నారి మనసును తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో.. తమ ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.

మధురై జిల్లాకు చెందిన కచ్చైకట్టి ప్రాంతానికి చెందిన తెన్నరసి.. తన నిర్ణయాన్ని ప్రధాని మోడీకి లేఖ రూపంలో తెలియజేసింది. కరోనాతో మరణించిన వారిని ఖననం చేసేందుకు వీలుగా ఆ భూమిని అప్పగిస్తామని పేర్కొంది. ప్రధానికి పంపిన ఆమె ప్రపోజల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. వయసులో చిన్నదే అయినా.. పెద్దోళ్లు సిగ్గుతో చితికిపోయేలా చేసిన ఆమె పెద్ద మనసుకు హేట్సాప్ చెబుతున్నారు.