Begin typing your search above and press return to search.

ఆంధ్రా అమిత్‌షాగా మారిన టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:47 AM GMT
ఆంధ్రా అమిత్‌షాగా మారిన టీడీపీ ఎంపీ
X
అమిత్ షా ఈ పేరు విన‌గానే మ‌న‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడ‌ని తెలుసు. కానీ ఇప్పుడు టీడీపీ లో కూడా ఓ అమిత్ షా ఉన్నారు. ఎస్ ఇది నిజ‌మే టీడీపీ కి చెందిన ఆ ఎంపీ ని చూసి బీజేపీ ఎంపీలు అమిత్ షా అని పొర‌ప‌డుతున్నారు. ఆ ఎంపీ పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌ లో ఉంటే వివిధ రాష్ర్టాల‌ కు చెందిన బీజేపీ ఎంపీలు ఆయ‌న్ను దూరంగా చూసి అమిత్ షా అనుకుని ఆయ‌న వ‌ద్ద‌కు వ‌స్తున్నారు. ఇంత‌కు ఆ ఎంపీ ఎవ‌రో కాదు టీడీపీకి చెందిన ఏలూరు లోక్‌స‌భ స‌భ్యుడు మాగంటి వెంకేటేశ్వ‌ర‌రావు (బాబు).

ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో క‌నిపించే మాగంటి బాబు ఇటీవ‌ల గెడ్డం పెంచారు. మాగంటి బాబు పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌ లో ఉండ‌గా ఆయ‌న్ను దూరం నుంచి చూసిన ఓ బీజేపీ సీనియ‌ర్ ఎంపీ ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి అమిత్ షా అనుకుని ప‌ల‌క‌రించ‌బోయార‌ట‌. ఆయ‌న తీరా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చూస్తే

ఆయ‌న అమిత్ షా కాద‌ని అర్థ‌మైంద‌ట‌. ఆయ‌నే కాదు మాగంటి బాబు గురించి తెలియ‌ని ఇత‌ర రాష్ర్టాల‌కు చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు సైతం బాబును దూరం నుంచి చూసి అమిత్ షా అని పొర‌బ‌డుతున్నార‌ట‌.

ఇక బీజేపీ ఎంపీలు అయితే ఆయ‌న‌ కు ఓ ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చార‌ట‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏపీలో తీవ్ర‌మైన పోరు జ‌రుగుతోంది. మీరు ఎలాగూ అమిత్ షా లా ఉన్నారు క‌దా.... రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా ఇస్తున్నామ‌ని.... మీరే రాత్రి పూట ప్ర‌క‌న‌ట చేస్తే జ‌నాలు న‌మ్మేస్తార‌ని చెప్పారు. బాబు కూడా వారికి చ‌మ‌త్కారం గానే స‌మాధాన‌మిచ్చారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌న‌ పై తాను సంత‌కం చేస్తున్న‌ట్టు ఫొటో దిగి ప‌త్రిక‌ల‌కు ఇస్తాన‌ని ...అప్పుడు వారంతా ఆ ఫొటో చూసి అమిత్ షా అనుకుంటార‌ని బాబు చెప్పార‌ట‌.

అలాగే బాబు మంగ‌ళ‌వారం పార్ల‌మెంటు లో ఏపీ కి చెందిన బీజేపీ ఎంపీలు కంభంపాటి హ‌రిబాబు, గోక‌రాజు గంగ‌రాజు తో క‌లిసి టీడీపీపీ కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి తో ఫొటోలు దిగ‌డం తో పాటు వారి మ‌ధ్య‌న ఉండి అమిత్ షాలా న‌డిచి మ‌రీ చూపించారు. దీంతో అక్క‌డే ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీలు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు. ఇక కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు బాబును గ‌డ్డం ఎప్పుడు తీస్తావ‌ని అడ‌గ్గా మీరు ప్ర‌త్యేక హోదా ఇచ్చా కే అని బాబు చెప్ప‌డంతో వెంక‌య్య సైతం న‌వ్వేశారు. అది ఆంధ్రా అమిత్ షా క‌థ‌.