Begin typing your search above and press return to search.

మ్యాగీలో బూడిదా..అంతా అబ‌ద్దం

By:  Tupaki Desk   |   5 Dec 2017 5:49 AM GMT
మ్యాగీలో బూడిదా..అంతా అబ‌ద్దం
X
ఎఫ్‌ ఎంసీజీ దిగ్గజం నెస్లే.. మ్యాగీపై మరోసారి ముసురుకుంటున్న దుమారంపై స్పందించింది. మ్యాగీ నూడుల్స్‌ లో ప్రమాదకరమైన సీసం - పాదరసం కలుస్తున్నాయంటూ ఇంతకుముందు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే వీటి నుంచి బయటపడిన నెస్లేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ లోని షాజహాన్‌ పూర్ జిల్లా పరిపాలనా విభాగం జరిమానా కొత్త చిక్కుల్లో పడేస్తున్నది. ల్యాబ్ పరీక్షల్లో వినియోగదారుల ఆరోగ్యానికి హానిచేసేలా మోతాదుకు మించి బూడిద అవశేషాలున్నట్లు గుర్తించామని గత వారం నెస్లే ఇండియా - దాని పంపిణీదారులపై షాజహాన్‌ పూర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరిమానా వేసింది. సీఐఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ దీనిపై మాట్లాడుతూ అదంతా దుష్ప్ర‌చారమ‌న్నారు.

భారతీయ ఆహార భద్రత - ప్రామాణిక ప్రాధికార వ్యవస్థ ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ ఇటీవలి ప్రమాణాలకు అనుగుణంగానే మ్యాగీ నూడుల్స్ తయారవుతున్నాయ‌ని సురేశ్ నారాయ‌ణ‌న్ ప్ర‌క‌టించారు. `మ్యాగీ నూడుల్స్ వినియోగం నూటికి నూరుపాళ్లు సురక్షితం. దీని తయారీలో ఎలాంటి బూడిద అవశేషాలు వాడటం లేదు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌ లో జారీ అయిన ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ మార్గదర్శకాలను తూ.చా తప్పకుండా పాటిస్తున్నాం` అని అన్నారు. షాజహాన్‌ పూర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు అందాయని, వీటిని పూర్తిగా పరిశీలించాక తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్న ఆయన అప్పటిదాకా ఈ విషయంలో ఇంతకంటే తామేమీ మాట్లాడబోమన్నారు. మోతాదుకు మించి సీసం - పాదరసం ఉన్నాయన్న ఆరోపణలపై 2015 జూన్‌ లో మార్కెట్ నుంచి మ్యాగీని వెనుకకు తీసుకున్న నెస్లే ఇండియా.. ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ విధించిన ఐదు నెలల నిషేధం తర్వాత అదే ఏడాది నవంబర్‌ లో తిరిగి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే ఆహార తయారీపై సీఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ కూడా అయిన సురేశ్ నారాయణన్.. భారతీయ ఆహార పరిశ్రమ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఏప్రిల్ 2000 నుంచి డిసెంబర్ 2016 వరకు ఈ రంగంలోకి సుమారు 7.5 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ సీఈవో పవన్ అగర్వాల్ తెలిపారు. ఆహార పదార్థాలు - తయారీ కేంద్రాల తనిఖీల్లో పారదర్శకత - స్థిరత్వాన్ని తీసుకొచ్చేలా ఓ ఐటీ వేదికను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. దీనివల్ల తనిఖీ ప్రక్రియ వేగవంతమవుతుందన్న ఆయన ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ గుర్తించిన అన్ని ఆహార పరీక్షా కేంద్రాలు ఆన్‌ లైన్‌ పైనే టెస్టింగ్ రిపోర్టులను దాఖలు పర్చాల్సి ఉంటుందన్నారు. ఇకపై ఆహార తయారీ వ్యాపారుల నమోదు - వారికిచ్చే లైసెన్సులు అన్నింటిలోనూ టెక్నాలజీని వాడుతామన్నారు.