Begin typing your search above and press return to search.

మ్యాగీ లో 'బూడిద‌'...నెస్లేకు రూ.62 ల‌క్ష‌ల ఫైన్‌!

By:  Tupaki Desk   |   29 Nov 2017 2:23 PM GMT
మ్యాగీ లో బూడిద‌...నెస్లేకు రూ.62 ల‌క్ష‌ల ఫైన్‌!
X
రెండు సంవ‌త్స‌రాల క్రితం దేశ‌వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ పేరు మార్మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ నూడుల్స్ లో ఆరోగ్యానికి హాని క‌లిగించే విధంగా ప్ర‌మాద‌ర‌క‌స్థాయిలో..... మోతాదుకు మించి సీసం ఉంద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో 2015లో మ్యాగీ నూడుల్స్ పై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. దీంతో, బ‌హిరంగా మార్కెట్లో, డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ద్ద‌, షాపుల‌లో ఉన్న మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ల‌ను నెస్లే సంస్థ వెన‌క్కు తెప్పించేసింది. ఆ త‌ర్వాత త‌గినంత‌ మోతాదులో సీసం క‌లిపిన మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ల‌ను నెస్లే మార్కెట్లోకి విడుద‌ల చేసింది. దీంతో, ఈ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిపోయింది. అయితే, తాజాగా ఆ స‌మ‌యంలో సేక‌రించిన మ్యాగీ నూడుల్స్ న‌మూనాలు నెస్లేకు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. 2015లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని షాజ‌హాన్ పూర్ లో సేక‌రించిన న‌మూనాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే విధంగా మోతాదుకు మించి బూడిద(యాష్ కంటెంట్‌) ఉంద‌ని ప‌రీక్ష‌ల్లో తేలింది.

2015లో సేక‌రించిన న‌మూనాల‌లో మాన‌వుల‌కు ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో మోతాదుకు మించి బూడిద ఉన్న‌ట్లు షాజ‌హాన్ పూర్ జిల్లా అధికారులు గుర్తించారు. ఈ విష‌యంపై దాదాపుగా సంవ‌త్స‌ర‌న్న‌ర పాటు నెస్లే సంస్థ వాద‌న‌లను విన్నారు. ఆ త‌ర్వాత....తాజాగా, నెస్లే సంస్థ‌కు రూ.45 ల‌క్ష‌ల‌ భారీ జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతోపాటు ముగ్గురు స్థానిక డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు రూ.17లక్ష‌ల జ‌రిమానా విధించారు. దీంతో, మొత్తం రూ.62 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన‌ట్ల‌యింది. అయితే, మోతాదుకు మించి బూడిద ఉన్న విష‌యంపై త‌మ‌కు అధికారులు స‌మాచారం అందించార‌ని, జ‌రిమానా విధిస్తున్న‌ట్లు ఎటువంటి స‌మాచారం అంద‌లేద‌ని నెస్లే ప్ర‌తినిధులు చెప్పారు. జ‌రిమానాకు సంబంధించిన ఆదేశాలు అందిన వెంట‌నే అప్పీలుకు వెళ‌తామ‌ని అన్నారు. గ‌తంలో ఇదే త‌ర‌హాలో నార్‌, ప‌తంజ‌లి నూడిల్స్ లో కూడా మోతాదుకు మించి బూడిద ఉంద‌న్న విష‌యాన్ని యూపీ అధికారులు గుర్తించిన సంగ‌తి తెలిసిందే.