Begin typing your search above and press return to search.

మ్యాజిక్ ఫిగ‌ర్ లేకున్నా ఏర్ప‌డేది టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ‌మే!

By:  Tupaki Desk   |   3 Dec 2018 8:17 AM GMT
మ్యాజిక్ ఫిగ‌ర్ లేకున్నా ఏర్ప‌డేది టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ‌మే!
X
తెలంగాణ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగ‌ర్ 60. అన్ని సీట్లు ద‌క్కించుకుంటే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. టీఆర్ ఎస్ - ప్ర‌జా కూట‌మి ఇప్పుడు ఆ నంబ‌ర్‌ పైనే దృష్టిసారించాయి. మ్యాజిక్ ఫిగ‌ర్‌ ను ఈజీగా దాటేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జా కూట‌మి సంగ‌తేమోగానీ టీఆర్ ఎస్ మాత్రం 60 సీట్లు రాకున్నా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌గ‌ల‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కారు పార్టీ గ‌ట్టిగా పోరాడి 50 స్థానాలు గెల్చుకుంటే చాల‌ని వారు సూచిస్తున్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మిగ‌తా సంఖ్య‌ను ద‌క్కించుకోవ‌డం వారికి అంత క‌ష్ట‌మేమీ కాద‌ని పేర్కొంటున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు 50 కంటే త‌క్కువ సీట్లు వ‌స్తే టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ముందుకు రాద‌ట‌. క‌నీసం 50-51 వ‌స్తే మాత్రం ప్ర‌భుత్వ ఏర్పాటు అవ‌కాశాన్ని వ‌దులుకోబోద‌ట‌. ఎందుకంటే గులాబీ ద‌ళానికి ఎంఐఎం మ‌ద్ద‌తు ఉంది. మ‌జ్లిస్‌కు ఎప్పుడూ 7 సీట్లు జేబులో ఉన్న‌ట్లే. టీఆర్ ఎస్‌ - మజ్లిస్ క‌లిస్తే మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ఇంకో మూడు సీట్లు త‌క్కువ‌వుతాయి. అప్పుడు బీజేపీ మ‌ద్ద‌తిస్తే స‌రేస‌రి. లేక‌పోయినా పెద్ద నష్ట‌మేమీ ఉండ‌దు. తెలంగాణ‌లో 7-8 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలుస్తార‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేలు చెబుతున్నాయి. అంత‌గా కాక‌పోయినా ఓ ముగ్గురు గెలిచినా చాలు. వారిని గులాబీ ద‌ళం సులువుగా త‌మ‌వైపుకు తిప్పుకోగ‌ల‌దు.

ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ప్ర‌జా కూట‌మి నుంచి వ‌ల‌స‌లు. ప్ర‌భుత్వ ఏర్పాటులో టీఆర్ ఎస్‌ కు 3-4 మంది అభ్య‌ర్థులే త‌క్కువైతే.. ప్ర‌జా కూట‌మి నుంచి ఫిరాయింపులు చోటుచేసుకునే అవ‌కాశ‌ముంది. డ‌బ్బు - మంత్రి ప‌ద‌వులు ఆశ‌జూపి టీఆర్ ఎస్ వారిని త‌మ‌వైపుకు ఈజీగా తిప్పుకోగ‌ల‌ద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే.. తెలంగాణ‌లో మరోసారి గులాబీ ప్ర‌భుత్వ ఏర్పాటు ఖాయ‌మ‌నీ వారు చెబుతున్నారు.