Begin typing your search above and press return to search.

టీడీపీకి మ‌రో షాక్‌!..1న వైసీపీలోకి మాగుంట‌!

By:  Tupaki Desk   |   18 Feb 2019 1:51 PM GMT
టీడీపీకి మ‌రో షాక్‌!..1న వైసీపీలోకి మాగుంట‌!
X
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార టీడీపీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీకి రాజీనామా చేసిన ఇద్ద‌రు ఎంపీలు - ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరిపోయారు. వారితో పాటు టీడీపీకే చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త - విజ‌య్ ఎల‌క్ట్రిక‌ల్స్ అధినేత దాస‌రి జై ర‌మేశ్ కూడా వైసీపీకి జైకొట్టారు. అంత‌కుముందే టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తోడ‌ల్లుడు - ప్ర‌కాశం జిల్లాకు చెందిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న కుమారుడితో కలిసి వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో మరింత మంది టీడీపీ నేత‌లు వైసీపీ బాట ప‌ట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ జాబితా చాలా పెద్ద‌దిగానే ఉంద‌ని - టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరే నేత‌లు చోటా మోటా నేత‌లు ఎంత‌మాత్రం కాదన్న‌విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఈ జాబితాలో ప్ర‌కాశం - నెల్లూరు జిల్లాల్లో మంచి ప‌ట్టున్న మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి కూడా ఉన్న‌ట్లుగా స‌మాచారం.

ఇప్ప‌టికే త‌న వ‌ర్గీయుల‌తో ప‌లుమార్లు భేటీ అయిన మాగుంట‌... టీడీపీని వీడుతున్న‌ట్లుగా సంకేతాలు పంపారు. ఈ మాట నిజ‌మేనన్న‌ట్లుగా... తాను టీడీపీకి రాజీనామా చేస్తున్న విష‌యంపై జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న ఆసక్తిక‌ర కామెంట్లు చేశారు. టీడీపీకి రాజీనామా చేయ‌డం లేద‌ని చెప్ప‌డానికి బ‌దులుగా ఈ నెల 28న తాను త‌న మ‌న‌సులోని మాట‌ను చెబుతాన‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దీనిని బ‌ట్టి ఆయ‌న టీడీపీకి రాజీనామా చేయ‌డం ఖాయ‌మేన‌ని - ఆ తర్వాత వైసీపీలోకి చేర‌డం కూడా గ్యారెంటేన‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ నెల 20న లండ‌న్ టూర్‌ కు వెళ్ల‌నున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరిగి 26న హైద‌రాబాదు రానున్నారు. ఆ త‌ర్వాత అంటే ఈ నెల 28న జ‌గ‌న్‌ తో భేటీకి మాగుంట దాదాపుగా సిద్ధంగా ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

అంతేకాకుండా ఈ నెల 28న జ‌గ‌న్ తో భేటీ కానున్న మాగుంట‌... మార్చి 1న వైసీపీలోకి లాంఛ‌నంగా చేర‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట ఫ్యామిలీకి అటు త‌మ సొంత జిల్లాతో పాటుగా ఇటు ప్ర‌కాశం జిల్లాలోనూ మంచి ప‌ట్టుంద‌నే చెప్పాలి. పారిశ్రామిక‌రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను సంపాదించుకున్న మాగుంట ఫ్యామిలీ రాజ‌కీయాల్లోనూ త‌మ‌దైన ముద్ర వేసింది. ఈ క్ర‌మంలో మాగుంట టీడీపీని వీడి వైసీపీలోకి చేరితే... ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి భారీ దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మేనన్న వాద‌న వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఈ రెండు జిల్లాల్లో స‌త్తా చాటాల‌ని చూస్తున్న జ‌గ‌న్‌ కు మాగుంట చేరిక మరింత బ‌లాన్ని ఇచ్చినట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.