Begin typing your search above and press return to search.

వైసీపీలోకి మాగుంట‌!... నేడే ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   11 March 2019 4:02 AM GMT
వైసీపీలోకి మాగుంట‌!... నేడే ప్ర‌క‌ట‌న‌!
X
ఏపీలో కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ అధికార పార్టీ టీడీపీకి మ‌రో భారీ దెబ్బ త‌గల‌నుంది. ప్ర‌కాశం - నెల్లూరు జిల్లాల్లో మంచి ప్ర‌భావం చూపించే అవ‌కాశాలున్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ - సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డి వైసీపీ గూటికి చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఆదివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన మాగుంట‌... వైసీపీలోకి చేరేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మాగుంట వైసీపీలోకి చేరుతున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో... ఆయ‌న‌ను పార్టీలోనే నిలుపుకునేందుకు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అన్ని ర‌కాల య‌త్నాలు చేశారు. అయితే తాను పోటీ చేసే పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో నిలిచే పార్టీ అభ్యర్థుల ఖరారుపై త‌న నిర్ణ‌యానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన మాగుంట‌... ఓ ర‌కంగా తాను చెప్పిన వారికే త‌న ప‌రిధిలోని అసెంబ్లీల‌కు అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించాల‌ని కోరారు.

అయితే ఇందుకు చంద్ర‌బాబు స‌సేమిరా అన‌డంతో పాటుగా మీ సీటు మీరు చూసుకోండి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇక లాభం లేద‌నుకున్న మాగుంట... తాను ఈ ద‌ఫా టీడీపీ టికెట్‌ పై పోటీ చేయ‌లేన‌ని తేల్చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ సీట్ల‌ను ఎంచుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌తిపాదించారు. దీనికి కూడా మాగుంట స‌సేమిరా అనే అన్నార‌ట‌. ఇదిలా ఉంటే... మాగుంట పార్టీలోకి వ‌స్తే... ఇటు ఒంగోలు ఎంపీ సీటు అయినా, అటు నెల్లూరు ఎంపీ సీటు అయినా ఆయ‌న‌కు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మాగుంట కోసం ఇటు బాబాయి వైవీ సుబ్బారెడ్డితో పాటు అటు పార్టీలో కీల‌క నేత‌ - నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టేందుకు కూడా జ‌గ‌న్ మాన‌సికంగా సిద్ధ‌మైన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఎటూ తేల్చుకునేందుకు చాలా స‌మ‌యం తీసుకున్న మాగుంట‌... చివ‌రి నిమిషం దాకా వేచి చూసే ధోర‌ణినే అవ‌లంబించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆదివారం సాయంత్రం ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టం - అభ్య‌ర్థుల ఎంపిక‌పై యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉన్న నేప‌థ్యంలో ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని వైసీపీ నేత‌లు... మాగుంట‌ను కోరార‌ట‌. అదే స‌మ‌యంలో ఇంకెన్నాళ్లు ఈ ఊగిస‌లాట‌ - ఇక తేల్చేయండంటూ అనుచ‌ర గ‌ణం కూడా ఒత్తిడి చేయ‌డంతో మాగుంట త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. టీడీపీలో త‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డం - వైసీపీ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ రావ‌డంతో మాగుంట వైసీపీ వైపే మొగ్గుచూపిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వైసీపీలో చేరే విష‌యానికి సంబంధించి మాగుంట నేడు కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.