Begin typing your search above and press return to search.

పాండ‌వుల ల‌క్క ఇల్లు బ‌య‌ట‌కొచ్చింది

By:  Tupaki Desk   |   3 Nov 2017 5:28 AM GMT
పాండ‌వుల ల‌క్క ఇల్లు బ‌య‌ట‌కొచ్చింది
X
మ‌హాభార‌తం నిజంగా జ‌రిగిందా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అవున‌నేవాళ్లు చాలామందే క‌నిపిస్తారు. కానీ.. అందుకు ఆధారాలు చూపించాలంటేనే ఇబ్బంది. అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితిని అధిగ‌మించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే.. మ‌హాభారతంలోని కీల‌క‌ఘ‌ట్ట‌మైన పాండ‌వుల్ని స‌జీవ‌ద‌హ‌నం చేసేందుకు నిర్మించిన ల‌క్క ఇల్లు ఆన‌వాళ్లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ల‌క్క ఇంటిని నిర్మించి వారికి కానుక‌గా ఇవ్వ‌టం.. దాన్ని త‌గ‌ల‌బెట్టం.. ముప్పును ముందే ఊహించి సొరంగ మార్గంలో పాండ‌వులు త‌ప్పించుకోవ‌టం తెలిసిందే. ఈ ఘ‌ట్టానికి ముఖ్య‌మైన సొరంగాన్ని భార‌త పురావ‌స్తు నిపుణులు గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది.

చ‌రిత్ర‌ను వెలికి తీసేందుకు వీలుగా భార‌త పురావ‌స్తు శాఖ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ పాండ‌వుల ల‌క్క ఇంటిని అధికారులు ఎక్క‌డ ఉంద‌ని భావిస్తున్నారన్న‌ది చూస్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ భాగ్ ప‌ట్ ప్రాంతంలోని బార్నావాలో ల‌క్క ఇల్లు ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక సొరంగ మార్గ ఆన‌వాళ్ల‌ను గుర్తించారు. దీంతో త‌వ్వ‌కాలు జ‌ర‌పాల‌న్న కీల‌క నిర్ణ‌యాన్ని ఏఎస్ఐ తీసుకుంది.

విస్తృత అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత ల‌క్క ఇంటి ఆన‌వాళ్లను గుర్తించ‌టంతో త‌వ్వ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. డిసెంబ‌రు మొద‌టివారంలో ఈ తవ్వ‌కాల్ని ప్రారంభించి మూడు నెల‌ల పాటు జ‌ర‌పనున్నారు. ల‌క్క ఇల్లు ఉంద‌ని భావిస్తున్న బార్నావా ప్రాంతానికి విశేష‌మైన ప్రాశ‌స్త్యం ఉంద‌ని అక్క‌డి వారు చెబుతారు.

నిజానికి బార్నావాను వ‌ర్ణావ్ర‌త్ అని పిలిచేవారు. పాండ‌వులు త‌మ‌కుఇవ్వ‌మ‌ని అడిగిన ఐదు ఊళ్లలో బార్నావా ఒక‌టిగా భావిస్తున్నారు. ఆ మ‌ధ్య‌న ఇక్క‌డ స‌మీపంలోని చందాయాన్‌.. సినౌలీ ప్రాంతాల్లో జ‌రిపిన త‌వ్వ‌కాల్లో భారీ అస్తిపంజ‌రాలు.. కుండ‌లు.. జాతిర‌త్నాల‌తో కూడిన కిరీటం లాంటివి బ‌య‌ట‌ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో ఆ ప్రాంతంలోని మ‌ట్టి దిబ్బ‌ల లోప‌ల సొరంగ భాగం ఉండ‌టంతో అది పాండ‌వులు త‌ప్పించుకున్న మార్గంగా భావిస్తున్నారు.

ఈ సొరంగం అనేక మ‌లుపులు ఉండ‌టంతో.. దీని లోప‌ల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. తాజాగా త‌వ్వ‌కాల‌ను ప్రారంభిస్తే.. మ‌రిన్ని వాస్త‌వాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇంత‌కాలం మ‌హాభార‌తం క‌ల్పిత గాథ‌.. నిజ‌మా? అన్న సందేహానికి త్వ‌ర‌లోనే తేలిపోనున్న‌ట్లుగా చెప్పాలి.