Begin typing your search above and press return to search.

పొరుగు రాష్ట్రంలో షాకింగ్ ఆప‌రేష‌న్

By:  Tupaki Desk   |   5 Aug 2016 10:19 AM GMT
పొరుగు రాష్ట్రంలో షాకింగ్ ఆప‌రేష‌న్
X
మహారాష్ట్రలోని మహద్ సమీపంలో బ్రిటీష్ కాలం నాటి వంతెన కూలిపోయిన ఘ‌ట‌న‌లో షాకింగ్ వార్త‌లు వెలువ‌డుతూనే ఉన్నాయి. ఈ న‌దిలో పెద్ద ఎత్తున‌ వాహనాలు గల్లంతైన నేప‌థ్యంలో రెండ్రోజులుగా సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. నదిలో కొట్టుకుపోయిన బస్సులు - కార్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తేల్చేందుకు 300 కిలోల బరువైన అయస్కాంతాలను వినియోగిస్తున్నారు. ఈ త‌ర‌హా ఆప‌రేష‌న్ పూర్తి కొత్త‌ద‌ని అధికారులు చెప్తున్నారు.

నది 40 అడుగుల మేరకు ప్రవహిస్తుండగా - భారీ అయస్కాంతాలను చిన్న చిన్న రెస్క్యూ పడవలకు కట్టి నదిలో వదిలి సోదాలు జరుపుతున్నారు. అవి బలంగా కదిలిన వేళ - ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్లు - నేవీ డైవర్లు నీటి అడుగుకు వెళుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్ నీట మునగగా, వెంటనే స్పందించిన చాపర్ టీమ్ వారిని రక్షించింది. బ్రిడ్జి కూలిన ఘటనలో రెండు బస్సులు, మూడు కార్లు గల్లంతైనట్టు తెలుస్తుండగా, వాటిల్లో ఒక్క వాహనం ఆచూకీ కూడా ఇంత వరకూ తెలియరాలేదు. మొత్తం 22 మంది వరకూ ఈ వాహనాల్లో ఉన్నారని అంచనా. 1940లో నిర్మించిన వంతెన ప్రమాదకరమని - దీన్ని తొలగించాలని నిపుణులు హెచ్చరించినప్పటికీ, మహార్రాష్ట సర్కారు దీన్ని వాడుతూనే ఉంది. పూర్తి ఇటుకలతో నిర్మించడం, దీని గోడల్లో మొలిచిన చెట్ల కారణంగా బలహీనమైపోయిన వంతెన ఒక్కసారిగా దూసుకువచ్చిన భారీ వరదతో తెగి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

ముంబయి- గోవా హైవేపై సావిత్రీ నదిపై వంతెన కూలిన ఘటనలో రెండు బస్సులు - నాలుగు కార్లు కొట్టుకుపోయిన ఉదంతంలో, ఓ బస్సు డ్రైవర్‌ తో పాటు ఆయన కుమారుడు కూడా బస్సులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. శ్రీకాంత్ కాంబ్లే అనే బస్సు డ్రైవర్ - తన కుమారుడిని ముంబయిలోని కాలేజీ అడ్మిషన్ ఇంటర్వ్యూ ఉన్నందున అతన్ని కూడా తన వెంట తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను అనుమతి కోరాడని తెలుస్తోంది. అధికారులు అనుమతించగా, తన 17 సంవత్సరాల కొడుకు మహేంద్రను బస్సులో తీసుకువెళ్లాడని శ్రీకాంత్ చిన్న కుమారుడు మిళింద్ వెల్లడించారు. ఇంటికి పెద్ద దిక్కుతో పాటు ఆసరాగా నిలవాల్సిన పెద్ద కుమారుడు కూడా ఈ ఘటనలో గల్లంతు కావడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.