Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌హాకూట‌మి?

By:  Tupaki Desk   |   29 Jan 2018 5:29 AM GMT
తెలంగాణ‌లో మ‌హాకూట‌మి?
X
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుందా? అంత‌కంత‌కూ తిరుగులేని మ‌హాశ‌క్తిగా మారుతున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు చెక్ పెట్టేందుకు రాజ‌కీయ పార్టీల‌న్నీ ఏకం కానున్నాయా? అంటే అవున‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. బీజేపీ ఒక్క‌టి మిన‌హా.. టీఆర్ ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఒక కూట‌మి ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. రాష్ట్రంలో కేసీఆర్‌ కు చెక్ పెట్టాలంటే ఏ ఒక్కరితోనే అయ్యే ప‌ని కాద‌న్న విష‌యాన్ని రాజ‌కీయ పార్టీలు అర్థం చేసుకున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాల్ని గ‌ద్దె దింప‌ట‌మే ల‌క్ష్యంగా కొత్త స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్ర‌భాగాన నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో కొత్త కూట‌మి దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ కూట‌మిలో కాంగ్రెస్ తో పాటు సీపీఎం.. సీపీఐ.. తెలంగాణ టీడీపీతో పాటు టీజేఏసీ కూడా రానున్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. కూట‌మి మాట‌ను ఎవ‌రు తెర మీద‌కు మొద‌ట తీసుకొస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి కారణం లేక‌పోలేదు. ఎవ‌రైతే తొలుత కూట‌మి ప్ర‌స్తావ‌న తెస్తారో.. వారికి సీట్ల కేటాయింపులు త‌క్కువ‌గా జ‌రిగే వీలుంది. దీంతో.. ఎవ‌రికి వారు కూట‌మి ప్ర‌స్తావ‌న తెస్తార‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖ‌మ‌న్న విష‌యాన్ని విప‌క్ష పార్టీలు అర్థం చేసుకున్నా.. కూట‌మి కార‌ణంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే సీట్ల లెక్క‌ల విష‌యంలో త‌మ వాటా త‌గ్గుతుంద‌న్న అభిప్రాయం పార్టీల్లో ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పార్టీలు స‌రిపోవ‌న్న‌ట్లుగా కోదండం మాష్టారి నేతృత్వంలో టీజేఏసీ పార్టీ పెట్ట‌టంపై కాంగ్రెస్ కు సుతారం ఇష్టం లేద‌ని చెబుతున్నారు. పార్టీలు పెరిగే కొద్దీ ఓట్లు చీలిపోతాయ‌ని.. అంతిమంగా ఈ ప‌రిణామం అధికార టీఆర్ఎస్‌కు లాభం చేకూరేలా చేస్తుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు బీజేపీ విడిగా పోటీ చేయ‌టం వ‌ల్ల ఓట్లు చీల‌తాయ‌ని.. అలా అని బీజేపీని క‌లుపుకొని వెళ్లే ప్ర‌సక్తి ఉండ‌ని నేప‌థ్యంలో మ‌హాకూట‌మి కార‌ణంగా లాభం ఎంత‌న్న ప్ర‌శ్న కొంద‌రు నేత‌ల్లో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. వివిధ వ‌ర్గాలు ఒక వేదిక మీద‌కు వ‌చ్చి కూట‌మిగా ఏర్ప‌డితే న‌ష్టం ఉండ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న వ‌స్తున్నా.. పొత్తుల మాట వినేందుకు బాగానే ఉన్నా.. సీట్ల స‌ర్దుబాటు త‌ల‌నొప్పులు అంతా ఇంతా కావ‌ని.. అంద‌రికి ఆమోద‌యోగ్యంగా సీట్ల కేటాయింపు అంత తేలికైన విష‌యం కాద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హాకూట‌మి వ‌ర్క్ వుట్ అయి.. కేసీఆర్ లాంటి జెయింట్‌ కు షాకిచ్చేలా మార‌టం అంత సులువు కాద‌న్న మాట వినిపిస్తోంది.