Begin typing your search above and press return to search.

మహాకూటమి టికెటిస్తామన్నా..ఆగమంటున్నారట..

By:  Tupaki Desk   |   9 Oct 2018 6:59 AM GMT
మహాకూటమి టికెటిస్తామన్నా..ఆగమంటున్నారట..
X
ఆపండి.. ప్లీజ్ టికెట్ల కేటాయింపు ప్రకటన ఆపండి.. అంటూ మహాకూటమి అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయట. వడివడిగా ఎన్నికల బరిలోకి దిగిపోదామనుకుంటుంటే ఇదేంటని కూటమి పెద్దలు కూడా తలలు గోక్కుంటున్నారంట. అసలు విషయం ఏంటంటే పండుగల సీజన్ రావడమే.

టీఆర్ ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. మహా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో కూడా దాదాపు డిసైడ్ చేసేశారు. జాబితా కూడా అంతర్గతంగా చెప్పేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం అనుకునేలోపు అభ్యర్థులు కొంచెం ఆగండి అని వేడుకుంటున్నారంట.

ఎన్నికలు అంటే కార్యకర్తలను - నాయకులను జాగ్రత్తగా చూసుకోవాలి. హడావుడి చేసే వారిని పక్కన పెట్టుకొని మంచి చెడులు చూసుకోవాలి. మందు - విందు - డబ్బులకు కొదవ లేకుండా ఎముక లేని చేయిలాగా ఖర్చు పెట్టేస్తుండాలి. ఆ లెక్కన ఖర్చు కోట్లు దాటిపోతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో నవంబరులో కథ ముగించేద్దామనుకున్న టీఆర్ ఎస్ నేతలకు ఎలక్షన్ కమిషన్ షాకిచ్చి డిసెంబరుకు ఎన్నికలను జరిపింది. అభ్యర్థులను కూడా ప్రకటించేయడంతో , వారు పడుతున్న అవస్థలు చూసి నోరెళ్లబెడుతున్నారు మహాకూటమి నేతలు.

గత వినాయక చవితికే కార్యకర్తల తాకిడికి ఉక్కిరిబిక్కిరి అయ్యాం.. ఇప్పడు సంక్రాంతి - బతుకమ్మ - దసరా - దీపావళి పండుగలు వరుసగా ఉండటంతో పరిస్థితి ఎలా ఉటుందోనని మదనపడిపోతున్నారంట కాంగ్రెస్ - టీడీపీ అభ్యర్థులు. పోటీ చేసేది మేమే కానీ - కొంచెం టైం తీసుకొని ప్రకటన చేయాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనతో ఏం చేయాలో తెలియక పీసీసీ పెద్దలు పునరాలోచనలో పడ్డారట.. టికెట్ ప్రకటన చేస్తామంటే వద్దంటున్న నేతల తీరుకు షాక్ కు గురవుతున్నారు..