Begin typing your search above and press return to search.

మ‌హాకూట‌మికి మంచి పేరు కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   1 Oct 2018 6:54 AM GMT
మ‌హాకూట‌మికి మంచి పేరు కావాల‌ట‌!
X
తెలంగాణ రాజ‌కీయాల్లో కూట‌మి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల వేళ కూట‌ములు త‌యారు కావ‌టం మామూలే. అధికార‌ప‌క్షానికి గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా ప‌లు కాంబినేష‌న్ల‌లో కూట‌ములు ఏర్ప‌డ‌తాయి. కానీ.. తెలంగాణ‌లో ఏర్ప‌డుతున్న కూట‌మి కాంబినేష‌న్ ఎవ‌రూ ఊహించ‌లేనిది.

ఎందుకంటే భిన్న‌ధ్రువాలు ఒక వేదిక మీద‌కు రావ‌టం.. కలిసి పోటీ చేయ‌టం అన్న‌ది ఊహ‌కు మాత్ర‌మే సంబంధించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా వాస్త‌వంగా మార‌టం తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెప్పాలి. ఏ పార్టీకి వ్య‌తిరేకంగా పార్టీ స్థాప‌న జ‌రిగిందో అదే పార్టీతో ఈ రోజు జ‌ట్టు క‌ట్టేందుకు రెఢీ కావ‌టమా? అంటే పెద్ద ఎఫెక్ట్ గా అనిపించ‌దు. అదే విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు అన్న మాట చెప్పినంత‌నే.. నిజ‌మా? అని ఆశ్చ‌ర్యానికి గురి కావ‌టం క‌నిపిస్తుంది. ఇదే సంచ‌ల‌నం అంటే.. దీనికి తోడు తెలంగాణ హార్డ్ కోర్ ఉద్య‌మ‌కారుడు.. అస‌లుసిస‌లు తెలంగాణవాదిగా చెప్పాల్సిన‌ కోదండం మాష్టారికి చెందిన పార్టీ ఈ రెండు పార్టీల‌కు జ‌త క‌ట్ట‌టం.. దానికి సీపీఐ తోడు కావ‌టం అంటే..మాట‌లు కాదు.

స‌రిగ్గా వ‌ర్క్ వుట్ అయితే.. సంచ‌ల‌న ఫ‌లితాలు రావ‌టానికి నూటికి నూరు శాతం అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. మ‌రి.. అలాంటి శ‌క్తివంత‌మైన కూట‌మికి ప‌వ‌ర్ ఫుల్ పేరు అవ‌స‌రం చాలానే ఉంటుంది. ప్ర‌స్తుతానికి పొత్తు ఖ‌రారు అన్న విష‌యం చివ‌రి ద‌శ‌లో ఉండ‌టం.. సీట్ల స‌ర్దుబాటుకు సంబంధించిన‌కీల‌క చ‌ర్చ‌లు సాగుతున్న వేళ‌.. ఈ కూట‌మికి ఏం పేరు పెట్టాల‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కూట‌మికి పేరు పెట్ట‌టం మామూలే. గ‌తంలో నేష‌న‌ల్ ఫ్రంట్ కానీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కానీ.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్లో ఉన్న బీజేపీకి చెందిన ఏన్డీయే ఇలా కూట‌మికి పేరు కీల‌కమ‌ని చెప్పాలి. ఆ మ‌ధ్య‌న ముగిసిన బిహార్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌.. లాలూ పార్టీతో పాటు నితీశ్ పార్టీ క‌లిసి మ‌హాఘ‌ట్ బంధ‌న్ పేరుతో బ‌రిలోకి దిగాయి. మ‌రి.. అదే తీరులో తాజాగా తెలంగాణ‌లో ఏర్ప‌డనున్న కూట‌మికి ఏ పేరు పెట్టాల‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై కూట‌మిలో భాగ‌స్వామ్య‌మైన పార్టీల‌న్ని మేథోమ‌ధ‌నం జ‌రుపుతున్నాయి. త‌మ కూట‌మి పేరు ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌ట‌మే కాదు.. ప‌వ‌ర్ కు ద‌గ్గ‌ర కానుంద‌న్న పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చేలా పేరు కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా చెబుతున్నారు. వినేందుకు ఆలోచ‌న‌లు బాగున్నాయి. మ‌రి.. ఆచ‌ర‌ణ ఎలా ఉంటుందో చూడాలి.