Begin typing your search above and press return to search.

ఈ నగరానికి ఏమైంది...!!!

By:  Tupaki Desk   |   23 Sep 2018 2:30 PM GMT
ఈ నగరానికి ఏమైంది...!!!
X
అవును. ఈ నగరానికి ఏమైంది. అందరూ దీన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు. ఉద్యోగాల కోసం వచ్చే వారు.... వ్యాపారాల కోసం వచ్చే వారు..... పాడు పనులు చేసేందుకు వచ్చే వారు... పుణ్యం ముట్టకట్టుకోవాలనుకునే వారు.... ఇలా అందరూ ఈ నగరానికే ఎందుకు వస్తున్నారు. అందరూ ఈ నగరాన్నే ఎందుకు తమ కేంద్రంగా ఎందుకు ఎంచుకుంటున్నారు. వీళ్లంతా సరే.... తమ బతుకు దెరువు కోసం.... ధనార్జన కోసం నగరాన్ని ఎంచుకుంటున్నారు. ఇది సబబే. ఇది మంచిదే. కాని ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా నగరాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా నగరం వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - అధికార తెలంగాణ రాష్ట్ర సమితి - జనసేన - వామపక్షాలు ఇలా అందరూ జంటనగరాల వైపే తమ కళ్లు సారిస్తున్నారు. అది కూడా పాతబస్తీని మినహాయించి మిగిలిన నియోజకవర్గాలనే ఎంచుకుంటున్నారు. మహా కూటమిగా ఏర్పడుతున్న కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి కూడా నగరంలోని సీట్లపైనే కన్ను వేశాయి. అంతే కాదు.... నగరం కోసం మ‌హాకూటమికి వ్యతిరేకంగా పనిచేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దీనికి కారణం ఏమిటనుకుంటున్నారా... ఏమీ లేదు.... సెటిలర్లు... అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కడుపు చేత పట్టుకుని వచ్చిన వారు. వీరి ఓట్లే విజయానికి కీలకం. దీంతో వీరంతా ఎటు వైపు ఉంటే వారికి విజయం దక్కుతుంది. ఇది గ్రహించిన రాజకీయ పార్టీల నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూకట్‌ పల్లి - మల్కాజిగిరి - శేరిలింగంపల్లి - ఖైరతాబాద్ - ఉప్పల్ నియోజకవర్గాల్లో సెటిలర్ల ఓట్లు కీలకం. వీరు కచ్చితంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయరని - అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఓట్లు వేయరని మిగిలిన పార్టీలు నమ్మకంగా ఉన్నాయి. దీంతో తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఆశావాహులు ఈ నియోజకవర్గాలు తమకు దక్కాలని గట్టి పట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే 12 స్ధానాలు కోరుతోంది. అదే సంఖ్యను తెలుగుదేశం పార్టీ కూడా పట్టు పడుతోంది. మహాకూటమి జట్టుకు ఇది విఘాతం కలిగించేదిగా ఉందని ఆ పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు. మరోవైపు పొత్తు పొడవక ముందే తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్‌ లో తెలుగుదేశం అభ్యర్ధిగా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మొత్తానికి ఈ నగరాని ఏమైందని ఓటర్లు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.