Begin typing your search above and press return to search.

మ‌హాకూట‌మి టికెట్ల ప్ర‌క‌ట‌న ఇలా ఉంటుంద‌ట‌!

By:  Tupaki Desk   |   24 Oct 2018 7:18 AM GMT
మ‌హాకూట‌మి టికెట్ల ప్ర‌క‌ట‌న ఇలా ఉంటుంద‌ట‌!
X
ఈ ప్ర‌పంచంలో ఎవ‌రు తెలివైనోళ్లు కాదు. అలా అని ఎవ‌రూ తెలివి త‌క్కువోళ్లు కాదు. తెలివి ఒక్క‌రి సొంతం అస‌లే కాదు. ఇది నిజం. కాకుంటే.. ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.. దాని ప్ర‌భావంతో మిగిలిన ప‌రిణామాలు ఎలాంటి చోటు చేసుకుంటాయ‌న్న‌దే లెక్క‌. ఈ విష‌యం గ‌తంలో చెబితే పెద్ద‌గా న‌మ్మే వారు కాదు. కానీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యాన్నే తీసుకుంటే.. వ్యూహాల్ని ర‌చించ‌టంలోనూ.. వాటిని అమ‌లు చేయ‌టంలోనూ ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని చెబుతారు. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌ని.. తాను చెప్పిన‌ట్లే తెలంగాణ స‌మాజం న‌డుస్తుంద‌న్న భావ‌న‌లో ఉండేవారు.

ఆయ‌న మైండ్ సెట్‌ కు త‌గ్గ‌ట్లే స‌ర్వే రిపోర్టులు రావ‌టం.. ముంద‌స్తు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌టం ద్వారా త‌న స‌త్తాను చాటుకోవాల‌ని.. ఆ గెలుపు ఊపుతో లోక్ స‌భ ఎన్నిక‌ల్నిఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించారు. అంతే వేగంగా పావులు క‌దిలి ముంద‌స్తు ఎన్నిక‌ల చిత్రం తెర మీద‌కు వ‌చ్చింది. ఎప్పుడైతే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయో.. అప్ప‌టి నుంచి తెలంగాణ‌లో ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. తెలంగాణ‌లో ముంద‌స్తు రావ‌టం ఖాయ‌మ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న నేప‌థ్యంలో.. కేసీఆర్ అండ్ కోకు షాకిచ్చేందుకు వీలుగా ఏపీ ముఖ్య‌మంత్రి ప‌క్కా ప్లాన్ ఒక‌టి సిద్ధం చేశారు. కాంగ్రెస్.. తెలంగాణ జ‌న‌స‌మితి.. టీడీపీ..సీపీఐలు క‌లిసి ఒక కూట‌మిగా ఏర్ప‌డి అధికార టీఆర్ ఎస్ ను ఎదుర్కోవాల‌న్న ప్లాన్ ను తెర మీద‌కు తెచ్చారు. ఈ నిర్ణ‌యాన్ని ఏ మాత్రం ఊహించ‌ని కేసీఆర్ ఒక్క‌సారిగా డిఫెన్స్ లో ప‌డిన‌ట్లు చెబుతారు. ఇదిలా ఉంటే..త‌న‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారే కూట‌మిని ఎదుర్కొనేందుకు కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా సాగ‌ని ప‌రిస్థితి. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ను ఓడించాలంటే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉండాలే కానీ.. విడివిడిగా ఉంటే క‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని గుర్తించి.. అందుకు త‌గ్గ‌ట్లే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

తాజాగా పొత్తుల‌కు సంబంధించిన లెక్క‌లు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్న నేప‌థ్యంలో టికెట్ల ప్ర‌క‌ట‌న ఎప్పుడ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కూట‌మి వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ నెలాఖ‌రులో కానీ.. న‌వంబ‌రు మొద‌టి వారంలోనే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెబుతున్నారు. తొలిసారి 60 సీట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో కూట‌మి నేత‌లంతా ఒకే వేదిక మీద‌కు వ‌చ్చి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని.. ఏ పార్టీకి ఆ పార్టీ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌ర‌ని చెబుతున్నారు. పార్టీ అభ్య‌ర్తుల్ని ప్ర‌క‌టించే స‌మ‌యంలో తామంతా క‌లిసి క‌ట్టుగా నిర్ణ‌యం తీసుకున్నామ‌న్న సందేశాన్ని ఇవ్వ‌టంతోపాటు.. త‌మ మ‌ధ్య ఐక్య‌త వెల్లి విరుస్తుంద‌న్న విష‌యాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. కూట‌మి ఐక్య‌త ఏ మాత్రం ఫోక‌స్ అవుతుందో చూడాలి.