Begin typing your search above and press return to search.
ఆ రెండు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల గంట..
By: Tupaki Desk | 21 Sep 2019 11:36 AM GMTదేశంలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గా ఉండేలా చేయటంలో ఎన్నికలు కీలకభూమిక పోషిస్తుంటాయని చెప్పాలి. ఈ ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికల సంరంభం.. సుదీర్ఘంగా సాగిన షెడ్యూల్ పుణ్యమా అని.. ఎన్నికల ఫలితాలు వెల్లడై.. కొత్త ప్రభుత్వం కొలువు తీరే సరికి మే మధ్యకు వచ్చేసింది.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షం బలహీనంగా ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అదే సమయంలో.. బీజేపీ ప్రభుత్వాల పని తీరు అంత గొప్పగా ఏమీ లేదన్న మాట వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఇక.. ఎన్నికల షెడ్యూల్ విషయానికి వస్తే.. రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్ని ఒక దశలోనే పూర్తి చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియను ఈ నెల 27న మొదలెట్టి.. అక్టోబరు నాలుగుతో ముగిస్తారు. అక్టోబరు 21న పోలింగ్ జరగనుంది. అక్టోబరు 24న కౌంటింగ్ ఉండనుంది.
మహారాష్ట్ర.. హర్యానా రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాల విషయానికి వస్తే.. అరుణాచల్ ప్రదేశ్.. బిహార్.. ఛత్తీస్ గఢ్.. అసోం.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్.. కర్ణాటక.. కేరళ.. మధ్యప్రదేశ్.. మేఘాలయ.. ఒడిశా.. పుదుచ్చేరి.. పంజాబ్.. రాజస్తాన్.. సిక్కిం.. తమిళనాడు.. తెలంగాణ.. ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. తాజా ఎన్నికల పుణ్యమా అని ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగిలే అవకాశం ఉందని చెప్పక తప్పదు.