Begin typing your search above and press return to search.

ఠాక్రే కుటుంబం.. హిందూ క‌ట్టెల‌తోనే సంస్క‌రించ‌బ‌డుతుంది: మ‌హారాష్ట్ర సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   22 Jun 2022 2:42 PM GMT
ఠాక్రే కుటుంబం.. హిందూ క‌ట్టెల‌తోనే సంస్క‌రించ‌బ‌డుతుంది:  మ‌హారాష్ట్ర సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి, మ‌హా పులి.. బాల ఠాక్రే పెద్ద కుమారుడు తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "ఠాక్రే కుటుంబం హిందూ క‌ట్టెల‌పైనే అంతిమ సంస్క‌రాలు చేయ‌బ‌డుతుంది. తుది శ్వాస వ‌ర‌కు హిందుత్వ‌మే అవ‌లంభిస్తుంది" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయ వ్యూహాల‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. "హిందూత్వానికి ఠాక్రే కుటుంబ‌మే ప్ర‌తీక‌. మ‌మ్మ‌ల్ని చూసి హిందూత్వాన్ని అజెండాగా తీసుకున్న కొన్ని పార్టీలు.. ఇప్పుడు మ‌మ్మ‌ల్ని హిందూత్వాన్ని నిరూపించుకునే స్థాయికి వ‌చ్చారు" అని నిప్పులు చెరిగారు.

ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోరాటం చేయబోనని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా రాజీనామా చేస్తానని వెల్లడించారు. కొంతమంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి ఆ పార్టీ మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించారు.

శివసేన ఎప్పుడూ హిందుత్వాన్ని వదిలిపెట్టలేదని అన్నారు ఠాక్రే. హిందుత్వం తమ గుర్తింపు అని చెప్పారు. ఈ సందర్భంగా ఏక్నాథ్కు పరోక్షంగా చురకలు అంటించారు ఠాక్రే. కొందరు ప్రేమతో గెలుస్తారు, ఇంకొందరు కుట్రలతో గెలుస్తారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. వాటి కోసం పోరాటం చేయబోనని పేర్కొన్నారు. తన తర్వాత కూడా శివసేన నాయకుడే సీఎం అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. "హిందుత్వ మా గుర్తింపు, మాభావజాలం. కరోనా సమయంలో మా కృషికి గుర్తింపు లభించింది. సీఎం పదవి తీసుకోవాలని శరద్‌ పవార్‌ నన్ను కోరారు. ఆయన కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పార్టీని నడిపించే సామర్థ్యం నాకు లేదని శివసైనికులు భావిస్తే.. నేను శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా'' అని అన్నారు.

"సూరత్ నుంచో, మరే ప్రదేశం నుంచో ప్రకటనలు చేయడం ఎందుకు? సీఎం, శివసేన అధ్యక్షుడిగా నేను అసమర్థుడినని నా ముందుకొచ్చి చెప్పండి. వెంటనే రాజీనామా చేస్తా. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుతా. మీరే రాజ్భవన్కు తీసుకెళ్లండి. నేను బాల్‌ఠాక్రే కుమారుడిని... పదవికి కోసం వెంపర్లాడను. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కింది. నాకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని లేదు. ఒక్క ఎమ్మెల్యే వద్దన్నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తా." అని ఉద్ద‌వ్ వ్యాఖ్యానించారు.