Begin typing your search above and press return to search.

మోడీకి ఆ రాష్ట్ర సీఎం సూటి సవాలు.. దావూద్ ను పట్టుకొని చంపగలరా?

By:  Tupaki Desk   |   26 March 2022 3:28 AM GMT
మోడీకి ఆ రాష్ట్ర సీఎం సూటి సవాలు.. దావూద్ ను పట్టుకొని చంపగలరా?
X
ఎంత రాజకీయం అయినప్పటికీ.. కొన్ని హద్దులు ఉంటాయి. పవర్ గేమ్ లోకి కొన్నింటిని తీసుకురాకుండానే రాజకీయం నడిచేది. కానీ.. కొంతకాలంగా అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయం వ్యక్తిగత అంశాల మీదా.. ఆర్థిక మూలాల మీదా ఫోకస్ ఎక్కవైన పరిస్థితి. దీంతో.. రాజకీయాలు తరచూ వేడెక్కిపోతున్నాయి. రాజకీయ వైరం వ్యక్తిగతంగా మారిపోతున్న వైనం.. ఒక దుష్ట సంప్రదాయాన్ని తెర మీదకుతీసుకొచ్చిందని చెప్పాలి. చేతికి అధికారం రావాలంటే అందుకు అవసరమైన దేన్నీ వదిలే పరిస్థితుల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి.

ఆ కోవలోకే వస్తుంది బీజేపీ అన్న మాట ఈ మధ్యన దాని రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి వినిపిస్తోంది. గడిచిన కొంతకాలంగా మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి బీజేపీకి మధ్య నడుస్తున్న లాడాయి గురించి తెలిసిందే. ఒకప్పటి పాత మిత్రుడ్ని అంత తేలిగ్గా వదిలిపెట్టని కమలనాథులు.. ఏ చిన్న అవకాశాన్ని వదల్లేటదన్న మాట వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి సోదరుడు (సొంత బావమరిది) శ్రీధర్ పాటన్కర్ కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టటం.. అందులో భాగంగా రూ.6.45 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాజాగా జఫ్తు చేయటం తెలిసిందే. దీంతో.. ఉడికిపోతున్న ఉద్దవ్ ఠాక్రే తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ సందర్భంగా మోడీ సర్కారు ఇరకున పడే వ్యాఖ్యల్ని చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. అండర్ వరల్డ్ డాన్ గా పేరున్న దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపేస్తారా? అసలు దావూద్ ఎక్కడ ఉంటాడు? బీజేపీకి నిజంగా దమ్ముంటే.. అతన్ని పట్టుకొని చంపేస్తారా? అంటూ సూటిగా సవాలు విసిరారు. గతంలో రామ మందిరం పేరు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగిన బీజేపీ.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పేరు చెప్పి ఓట్లు అడగాలని అనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. ఇటీవల మనీ లాండరింగ్ కేసులు అరెస్టు అయిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు దావూద్ కు సంబంధాలు ఉంటే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఆ దిశగా ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రావాలే కానీ.. అందుకు దుర్మార్గపు పనుల్ని చేయటం ఆపేయాలన్నారు. అధికారం కోసం ఇంకొకరి కుటుంబ సభ్యుల్ని వేధించకండి అంటూ విరుచుకుడ్డారు. ‘మేం మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్ట లేదు. మీ కుటుంబ సభ్యులు తప్పులు చేశారని.. వారిని ఇబ్బంది పెడతామని కూడా చెప్పట్లేదు. బీజేపీ అధికారంలోకి రావటం కోసం మమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటే పెట్టండి’ అంటూ ఉద్దవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.