Begin typing your search above and press return to search.

షిర్డీ సాయిని పూజిస్తే క‌రవు వ‌స్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   11 April 2016 10:40 AM GMT
షిర్డీ సాయిని పూజిస్తే క‌రవు వ‌స్తుంద‌ట‌!
X
ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం ఈ మ‌ధ్య‌న ఒక అల‌వాటుగా మారింది. స్వామీజీలుగా ప్ర‌జ‌లు మ‌న్న‌న‌లు పొందే వారు.. మ‌రింత బాధ్య‌త‌గా ఉండాల్సిందిపోయి.. రాజ‌కీయనేత‌ల్లా మాట్లాడ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. అధ్యాత్మిక‌వేత్త‌లుగా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించ‌టం.. న‌లుగురికి సాయం చేసే బాధ్య‌త‌ను మ‌రింత పెంచాల్సింది పోయి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. తీవ్ర క‌రువుతో ప్ర‌జ‌లు క‌ష్టాలు ప‌డుతుంటే.. వారికి త‌మ వంతుగా ఏదైనా సాయం చేయ‌టం.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారాల్ని వెత‌క‌టం లాంటివి చేయాల్సింది పోయి.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

మ‌హారాష్ట్రంలో క‌రువు రావ‌టానికి అక్క‌డ షిర్డీ సాయిబాబాను పూజించ‌ట‌మేన‌ని ద్వార‌కా శార‌దా పీట శంక‌రాచార్య స్వామి స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తి వ్యాఖ్యానించారు. మ‌హారాష్ట్రలోని క‌రువుకు షిర్డీసాయి భ‌క్తులు.. అనుచ‌రులు బాధ్య‌త వ‌హించాలన్నారు. హ‌రిద్వార్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. దేవుడిని పూజించ‌వ‌చ్చ‌ని.. ఫ‌కీరైన సాయిబాబాను పూజించ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. దీనివ‌ల్లే మ‌హారాష్ట్ర క‌రువు కాట‌కాల‌తో అల్లాడుతుంద‌ని వ్యాఖ్యానించారు.

పూజ‌కు అర్హ‌త లేని వారిని పూజించిన చోట పూజ‌లు చేస్తే క‌రువు.. వ‌ర‌ద‌లు.. మ‌ర‌ణ భ‌యం వెంటాడుతుంద‌న్నారు. షిర్డీసాయిపై త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే ఈ 94 ఏళ్ల ఈ స్వామీజీ శ‌నిసింగ‌నాపూర్‌లో పూజ‌లు చేసే మ‌హిళ‌లు లేని స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్లేన‌ని వ్యాఖ్యానించారు. శ‌నిదేవాల‌య గ‌ర్భ‌గుడిలో మ‌హిళ‌లు వెళ్ల‌టం స‌రికాద‌ని.. అది వారికి దుర‌దృష్టాన్ని తెచ్చి పెడుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ స్వామీజీ మాట‌ల్నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుందామ‌నుకుంటే.. షిర్డీ సాయిని కొత్త‌గా ఏమీ పూజించ‌టం లేద‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. కొన్ని ద‌శాబ్దాలుగా పూజిస్తున్న‌ప్పుడు.. అప్పుడు లేని క‌రువు ఇప్పుడే ఇంత‌లా విరుచుకుప‌డ‌టం ఏమిటి? మ‌ంచి అయితే ఎప్పుడూ మంచే.. అదేలా చెడు అయితే ఎప్పుడూ చెడేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. అలాంటివి మ‌రిచి బాధ్యతారాహిత్యంతోవ్యాఖ్య‌లు మంచివి కాద‌న్న విష‌యాన్ని ఇలాంటి స్వామీజీలు ఎప్పుడు గుర్తిస్తారో..?