Begin typing your search above and press return to search.

రైతు సైన్యం..టార్గెట్ మోడీ..రాజ‌ధానిలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   23 Nov 2018 5:38 AM GMT
రైతు సైన్యం..టార్గెట్ మోడీ..రాజ‌ధానిలో క‌ల‌క‌లం
X
బీజేపీ ర‌థ‌సార‌థి - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పై రైతుల ఆక్రోశం - ఆవేద‌న రోజురోజుకూ పెరిగిపోతోంది. అందుకే గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఏకంగా రైతు సైన్యం పేరుతో కొత్త వేదిక ఏర్పాటైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మహారాష్ట్ర రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శన గురువారం ముంబైకి చేరుకుంది. దీంతో ముంబై వీధులు రైతులతో కిటకిటలాడాయి. దీంతో ఆర్థిక రాజ‌ధానిలో ప‌రిస్థితులు తారుమారు అవ‌డం గ‌మ‌నించిన ప్ర‌భుత్వం వారి ఆవేశాన్ని చ‌ల్చార్చే ప్ర‌య‌త్నం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినట్లు రుణమాఫీని అమలు చేయాలని - అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని - కరువుతో అల్లాడుతున్న తమను ఆదుకోవాలని - స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం థానే నుంచి ముంబైకి ర్యాలీగా బయలుదేరిన విషయం తెలిసిందే. దాదాపు 40 కి.మీ.లు నడుచుకుంటూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌ కు చేరుకున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసన ప్రదర్శనను చూసైనా ప్రభుత్వం కళ్లు తెరువాలి అంటూ నినదించారు. దాదాపు 10వేల మంది రైతులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనడంతో ముంబైలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. రైతు నాయకులు సీఎం ఫడ్నవీస్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం ఒప్పుకున్న తమ డిమాండ్లను రైతు నాయకులు ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతుల డిమాండ్లను పరిష్కరిస్తానని - ప్రధానంగా మూడు నెలల్లో అటవీ భూములపై రైతులకు హక్కులు కల్పించేలా కృషిచేస్తానని - కరువు రైతులను ఆదుకుంటానని ఫడ్నవీస్ వారికి హామీనిచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

ఇదిలాఉండ‌గా - ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని కదం తొక్కిన రైతులు వ్యయ ప్రయాసల కోర్చి ముంబైకి చేరుకున్నారు. ఈ నిరసన ప్రదర్శన బుధ - గురువారాలు కొనసాగిన నేపథ్యంలో బయలుదేరేటప్పుడే బియ్యం - పప్పును వెంటతెచ్చుకున్నారు. ఒక రైతు ఖర్చుల కోసం తన మేకను రూ.1400లకు అమ్ముకొని మరి పాదయాత్రగా వచ్చారు. రైతుల్లో మహిళలు - యువకులు - వృద్ధులూ ఉన్నారు. మరోవైపు రైతుల నిరసన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు నడిచే దారిలో వాహనాల రాకపోకల్ని నిషేధించింది. నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన లోక్ సంఘర్ష్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రతిభ షిండే మాట్లాడుతూ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గతంలో ప్రభుత్వానికి పలుసార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదు. అందుకే మళ్లీ ఆందోళన బాట చేపట్టాం అని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనలో మెగసేసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ - సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.