Begin typing your search above and press return to search.

సచిన్.. లతా.. అక్షయ్.. అజయ్.. కోహ్లీ అండ్ కోకు మహారాష్ట్ర సర్కార్ షాక్

By:  Tupaki Desk   |   8 Feb 2021 4:30 PM GMT
సచిన్.. లతా.. అక్షయ్.. అజయ్.. కోహ్లీ అండ్ కోకు మహారాష్ట్ర సర్కార్ షాక్
X
గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న వ్యవసాయ చట్టాల్ని వెనక్కు తీసుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు మోడీ సర్కారుకు తలనొప్పిగా మారటమే కాదు.. తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అన్నింటికి మించిన గణతంత్ర దినోత్సవం వేళ.. ఢిల్లీలోని ఏర్రకోట వద్ద రైతుల పేరుతో కొందరు సిక్కుల మతానికి చెందిన జెండాను ఆవిష్కరించటంపై పలువురు తప్పు పట్టారు. చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే నాడు చోటు చేసుకున్న పరిణామాలు తనను షాక్ కు గురి చేసినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల వ్యవసాయ చట్టంపై పలు రంగాలకు చెందిన ప్రముఖులు కేంద్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు తప్పుపడుతున్నారు. అదే సమయంలో.. రైతుల ఉద్యమానికి అనుకూలంగా మరికొందరు ట్వీట్లు చేయటంపై ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రైతు అనుకూలంగా ఒక గ్రూపు.. ఉద్యమాన్ని తప్పు పడుతూ మరికొందరు వ్యవహరిస్తున్నారు.

ఇలాంటివేళ.. అనుకోని పరిణామం చోటు చేసుకుంది. ఉద్యమానికి వ్యతిరేకంగా.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వారంతా తమ మద్దతును బాహాటంగా ప్రకటించటం.. అందుకు తగ్గట్లే పోస్టు చేసిన ట్వీట్లు ఒకేలా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేస్తున్నారు. కేంద్రానికి మద్దతు ఇవ్వటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అన్నింటికి మించి.. సెలబ్రిటీలు పోస్టు చేసిన ట్వీట్లు మొత్తం ఒకేలా ఉండటంపై.. విచారణ జరుపుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటన సంచలనంగా మారింది.
కేంద్రంలోని మోడీ సర్కారుకు అనుకూలంగా ట్వీట్లు చేసిన ప్రముఖుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. గాయని లతా మంగేష్కర్.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. అజయ్ దేవగన్.. విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు. ఒకేలాంటి ట్వీట్లు పలు అనుమానాలకు తావిస్తోందని.. దీనిపై మహారాష్ట్ర నిఘా విభాగం దర్యాప్తు జరుపుతుందని మహా హోంమంత్రి పేర్కొన్నారు.

వరుస ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా.. మరెవరైనా ఉన్నారా? బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇదిలా ఉంటే.. మహా సర్కారు నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా ప్రకటన చూస్తే.. బడా ప్రముఖులు బెదిరేలా సేన సర్కారు ప్లానింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది.

కేంద్రంలోని మోడీ సర్కారుతో సుదీర్ఘకాలం స్నేహం చేసిన సేన సర్కారు ఇప్పుడు మహారాష్ట్రంలో ఉంది. ఇటీవల కాలంలో రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉప్పు.. నిప్పులా ఉంది. ఇలాంటివేళలో.. మహా హోంమంత్రి ప్రకటన ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. ఉత్కంటను పెంచుతోంది.