Begin typing your search above and press return to search.

మంత్రి కోసం 10 వేల లీటర్ల నీళ్లు నేలపాలు

By:  Tupaki Desk   |   16 April 2016 6:03 AM GMT
మంత్రి కోసం 10 వేల లీటర్ల నీళ్లు నేలపాలు
X
ఆ మధ్యన ఐపీఎల్ మ్యాచ్ ను ముంబయిలో నిర్వహించకూడదంటూ భారీగానే నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే.. మహారాష్ట్రలో కరవు తీవ్రంగా ఉండి నీళ్ల కోసం నానా కష్టాలు పడుతుంటే.. క్రికెట్ కోసం 45వేల లీటర్లు వృథా చేస్తారా? అంటూ కస్సుమన్నారు. పిచ్ ను తడిపేందుకు.. మ్యాచ్ కు తగ్గట్లుగా మార్చేందుకు 45 వేల లీటర్లు అవసరమవుతాయని.. ఓపక్కన గుక్కెడు నీళ్ల కోసం జనాలు కిందామీదా పడుతుంటే.. మరోవైపు.. అన్నేసి వేల లీటర్లు ఒక మ్యాచ్ కోసం వృధా చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

45 వేల లీటర్ల విలువ ఎంతన్నది కాసేపు పక్కన పెడితే.. ఈ వివాదం కారణంగా ఖర్చు చేసిన న్యూస్ ప్రింట్ కొన్నివేల రెట్లు ఎక్కువ. నీరు వృధా అవుతుందన్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ను నిలిపివేసేందుకు మొగ్గు చూపిన మహారాష్ట్ర సర్కారు తీరును చాలామంది ప్రశంసించారు. కొంతమంది అయితే.. జనాల కష్టాల మీద మహా సర్కారుకు ఎంత ప్రేమ అని ముచ్చటపడినోళ్లు ఉన్నారు. అయితే.. నీళ్ల అవసరం లేకుండా మ్యాచ్ నిర్వహించుకుంటామని కోరినా మహా సర్కారు మాత్రం నో అంటే నో అనేసింది.

ఐపీఎల్ మ్యాచ్ కు నీళ్లు వృధా అవుతాయన్న అంశం మీదనే భారీగా ప్రచారం జరిగిందే తప్పించి.. నీళ్లు లేకుండా కూడా మ్యాచ్ నిర్వహించకుంటామన్న విన్నపంపై మాత్రం మీడియాలో పెద్దగా వార్తలు రాలేదు. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. నీళ్ల మీద తనకెంత కమిట్ మెంట్ ఉందన్నది ఐపీఎల్ ఇష్యూలో మహా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇంత కమిట్ మెంట్ ఉన్న సర్కారులోని ఒక మంత్రిగారి భాగోతం వింటే విస్మయం చెందాల్సిందే.

చుక్కనీటి కోసం తహతహలాడిపోతున్న మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఆ రాష్ట్ర మంత్రిగారి కోసం అధికారుల ఘనకార్యాన్ని చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. లాతూరు ప్రాంతంలో చోటు చేసుకున్న మహా కరవును స్వయంగా సమీక్షించేందుకు.. బాధితులకు భరోసా ఇచ్చేందుకు రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే లాతూరు ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరానికి వచ్చారు.

అయ్యగారు హెలికాఫ్టర్ లో వచ్చిన నేపథ్యంలో హెలిప్యాడ్ లో దుమ్ము రేగకుండా ఉండటానికి 10వేల లీటర్ల నీటిని వృధా చేయటం గమనార్హం. ఐపీఎల్ మ్యాచ్ కు నీళ్లను దుర్వినియోగం చేయమని మొత్తుకున్నా ససేమిరా అన్న మహా ప్రభుత్వం.. కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తున్న నేల మీద పది వేల లీటర్ల నీటిని వృధా చేయటాన్ని ఏమనాలి? ఈ ఉదంతం చదివాకా మహా ప్రభుత్వానికి నీళ్ల మీదున్న కమిట్ మెంట్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.