Begin typing your search above and press return to search.

షిండే సర్కారుకు మరణశాసనం రాసేసిన మోడీషాలు.. కొత్త సీఎం ఎవరంటే?

By:  Tupaki Desk   |   26 April 2023 8:00 AM GMT
షిండే సర్కారుకు మరణశాసనం రాసేసిన మోడీషాలు.. కొత్త సీఎం ఎవరంటే?
X
ఏమైనా చేయాలి. చివరకు అధికారం తమ చేతిలో ఉండాలన్న పట్టుదల.. మొండితనం మోడీషాలకు ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న మోడీ సర్కారు.. తమకు కించిత్ పట్టున్న రాష్ట్రాల్లో అధికారం తమ చేతికి రావటం కోసం ఎంతకైనా అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయానా.. భయానా ఏదో ఒకటి చేసి అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అలవాటు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.

మహారాష్ట్రలో తమకు ఏ మాత్రం ఇష్టం లేని రీతిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శివసేన అధినేతను పదవి నుంచి దింపేయటమే కాదు.. ఆయనకు నమ్మిన బంటుగా ఉండే ఏకనాథ్ షిండేతో పార్టీని చేల్చేసిన వైనం తెలిసిందే. ఇందుకు ప్రతిఫలంగా అతగాడ్ని ముఖ్యమంత్రిని చేసి.. ఉప ముఖ్యమంత్రిగా గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్ ను నియమించటం తెలిసిందే. షిండే సర్కారు కాస్త కుదురుకుందన్న మాట వినిపిస్తున్న వేళలోనే సంచలన వ్యాఖ్యలు తెర మీదకు వచ్చాయి.

త్వరలోనే షిండే ప్రభుత్వానికి మరణశాసనం మోడీషాలు రాసేశారని.. అధికార బదిలీ ఖాయమన్న మాట వినిపించింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లెడ్ క్యాస్ట్రోతో పాటు.. శివసేన చీలిక వర్గాన్ని వ్యతిరేకించే సంజయ్ రౌత్ లు జోస్యం చెప్పారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఉద్దేవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సైతం మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లటానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చిన ఏడ్చారని పేర్కొనటం తెలిసిందే.

క్యాస్ట్రో.. రౌత్ లు చెప్పిన జోస్యాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా షిండే సెలవుపై వెళ్లిన నేపథ్యంలో.. ఆయన్ను పదవి నుంచి తప్పుకోమని ఆదేశాలు వచ్చేశాయని.. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సెలవుపై వెళ్లినట్లు చెబుతున్నారు. షిండే స్థానంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా చెబుతున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. షిండే సర్కారుకు మూడినట్లేనన్న మాట బలంగా వినిపిస్తోంది.