Begin typing your search above and press return to search.

సీఎంగా ఫ‌డ్న‌వీస్‌.. డిప్యూటీ సీఎంగా ఏక‌నాథ్ షిండే!.. తుదిద‌శ‌కు మ‌హా `రాజ‌కీయం!`

By:  Tupaki Desk   |   23 Jun 2022 1:28 PM GMT
సీఎంగా ఫ‌డ్న‌వీస్‌.. డిప్యూటీ సీఎంగా ఏక‌నాథ్ షిండే!.. తుదిద‌శ‌కు మ‌హా `రాజ‌కీయం!`
X
మ‌హారాష్ట్ర రాజ‌కీయం.. మ‌హా నాట‌కీయంగా మారిన విష‌యం తెలిసిందే. గ‌డిచిన రెండు రోజులుగా.. రాష్ట్రంలో ఏర్ప‌డ్డ రాజ‌కీయం అనూహ్య‌మైన మ‌లుపు తిరిగింది. అధికార కూట‌మి శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత‌, ఏక‌నాథ్ షిండే క్యాంపునకు చేరుకున్న నేపథ్యంలో.. తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమేనని శివసేన చెబుతుండడంతో షిండే రాజకీయ అడుగులు ఆస‌క్తిగా మారాయి.

ఏక్నాథ్ షిండే క్యాంపు.. 42 మంది ఎమ్మెల్యేలతో బలంగా కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలలో 35 మంది శివసేన వారు కాగా.. ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు. వీరంతా అసోం రాజధాని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేస్తున్నారు. రెబల్ క్యాంపు నుంచి వీడియోలు బయటకు వచ్చాయి.

శివసేనకు సభలో 54 మంది సభ్యుల బలం ఉంది. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు షిండే వైపు చేరితే.. చట్టబద్ధంగా శాసనపక్ష హోదా పొందే అవకాశం రెబల్స్కు లభిస్తుంది. అయితే, మరికొంత మంది ఎమ్మెల్యేలు షిండేతో టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరు కూడా తిరుగుబాటు చేసి షిండేతో కలిస్తే.. రెబల్స్కు మేజిక్ ఫిగర్ లభిస్తుంది.

ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. ఆది నుంచి హిందూత్వ అజెండాతో ముందుకు సాగుతున్న షిండే వెనుక‌.. బీజేపీ ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే బీజేపీ పాలిత రాష్ట్రం అసోంలో మ‌కాం వేశార‌ని అంటున్నారు. ఇక‌, మ‌రికొద్ది సమ‌యంలోనే బీజేపీ+షిండే మ‌ద్ద‌తు ఎమ్మెల్యేల కూట‌మి విష‌యం తెర‌మీదికి రానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని.. ఈ చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యే దిశ‌గ ఉన్నాయ‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. రాష్ట్రంలో బీజేపీ పాలిత ప్ర‌భుత్వం తెర‌మీదికి వ‌స్తుంద‌ని అంటున్నారు. అప్పుడు.. బీజేపీ ముఖ్యమంత్రిగా.. ఫ‌డ్న‌వీస్‌.. ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత శివ‌సేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే.. ప‌ద‌వుల్లోకి వ‌స్తార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ప్ర‌స్తుత తిరుగుబాటు కూట‌మి నుంచే మంత్రుల‌ను కూడా ఎంచుకుంటార‌ని.. ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి రెండున్న‌రేళ్ల‌లోనే మ‌హారాష్ట్రలో శివ‌సేన ప్ర‌భుత్వం కూలిపోయే ప‌రిస్థితికి రావ‌డం గ‌మ‌నార్హం.