Begin typing your search above and press return to search.

మహా సర్కారులా కేసీఆర్ సర్కారు ఆలోచిస్తే..?

By:  Tupaki Desk   |   1 Oct 2015 9:12 AM GMT
మహా సర్కారులా కేసీఆర్ సర్కారు ఆలోచిస్తే..?
X
ప్రభుత్వాలు ఏమైనా కానీ తమకు ఓట్లేసి.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల మీద పన్నుపోటు వేయాలని చూస్తాయే తప్పించి.. అంతకు మించి అన్న కోణంలో మాత్రం అస్సలు ఆలోచించవు. తాజాగా మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు వినూత్నమైన ఆలోచన చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

దాదాపు ఐదు నెలల పాటు అమల్లో ఉండే ఈ చట్టం పుణ్యమా అని పలు లావాదేవీలపై పన్నుపోటు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ‘‘కరవు పన్ను’’ అని పేరు పెట్టారు. పెట్రో ఉత్పత్తులు మొదలు.. సిగిరెట్లు.. మద్యం.. బంగారం.. రెస్టారెంట్లు లాంటి వాణిజ్య కార్యకలాపాలు అన్నింటిపైనా కరవు పన్నును విధించాలని నిర్ణయించారు.

ఈ పన్నుతో దాదాపు రూ.1600కోట్లు సమీకరించాలని మహారాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ నిర్ణయంతో పెట్రో ఉత్పతులు మొదలు సిగిరెట్.. బంగారం.. రెస్టారెంట్లు లాంటి వాటిల్లో జరిపే ప్రతి కార్యకలాపాలపైనా ఈ కొత్త పన్నును విధించనున్నారు. మహారాష్ట్రసర్కారు అమలు చేస్తున్న ఈ కొత్త పన్ను విధానం చూసి స్ఫూర్తి చెంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ‘అన్నదాత ఆత్మహత్యల నివారణకు.. రాష్ట్రవ్యాప్తంగా వారి రుణమాఫీ కోసం అవసరమైన రూ.8వేల కోట్ల సమీకరణ కోసం ఇలాంటి పన్ను విధానాన్నే తీసుకొస్తే? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర సర్కారు తీసుకున్న సరికొత్త పన్నుపోటు పుణ్యమా అని పెట్రోల్.. డీజిల్ ధరలు లీటరకు రూ.2 మేర పెరిగితే.. మద్యం.. సిగిరెట్లు.. కూల్ డ్రింకుల ధరకు 5శాతం.. బంగారం.. వజ్రాలు.. ఆభరణాలపై 0.2 శాతం వ్యాట్ పోటు వేయాలని భావిస్తున్నారు. నిత్యవసర వస్తువుల్ని వదిలేసినా.. లగ్జరీ వ్యవహారాలపై పన్ను పోటు పొడుస్తున్నారు. వినూత్న మార్గాల్ని అనుసరించే కేసీఆర్ దృష్టిని మహా సర్కారు అమలు చేస్తున్న కొత్త పద్ధతి కేసీఆర్ లో స్ఫూర్తి నింపితే తెలంగాణవారికి కొత్త పోటు తప్పనట్లే.