Begin typing your search above and press return to search.

‘మహా’ సర్కార్ సిత్రం.. మగాళ్లకు డ్రెస్ కోడ్.. ఆడోళ్లకు ఏదైనా ఓకే!

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:47 AM GMT
‘మహా’ సర్కార్ సిత్రం.. మగాళ్లకు డ్రెస్ కోడ్.. ఆడోళ్లకు ఏదైనా ఓకే!
X
గతానికి భిన్నంగా ప్రభుత్వ కార్యాలయాల్లో డ్రెస్ కోడ్ కు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సర్కారీ ఉద్యోగులకు పరిమితులు విధిస్తూ.. పని ప్రదేశంలో హుందాగా ఉండాలన్న పేరుతో.. విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు.. కాంట్రాక్టు ఉద్యోగుల వస్త్రధారణ ఎలా ఉండాలో సర్క్యులర్ జారీ చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర సర్కారు తాజాగా జారీ చేసిన సర్య్కులర్ షాకింగ్ గా మారింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు ఎవరైనా సరే.. మగాళ్ల వస్త్రధారణకు సంబంధించి సరికొత్త పరిమితులతో కూడిన నిబంధనల్ని జారీ చేశారు. చక్కటి వస్త్రధారణ ఉద్యోగుల వ్యక్తిత్వానికి గుర్తుగా నిలుస్తుందని పేర్కొంటూ.. అనుచిత దుస్తులు ధరించటం కారణంగా పని ప్రదేశంలో వాతావరణం దెబ్బ తినటమే కాదు.. పనితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ ఉపదేశాల్లో భాగంగా.. మగవాళ్లు ఆఫీసుల్లో జీన్స్.. టీషర్టు ధరించటానికి వీల్లేదని.. ప్రొఫెషనల్ స్థాయిలో ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించాలని పేర్కొన్నారు. కాళ్లకు షూ లేదంటే శాండిల్స్ మాత్రమే వేసుకోవాలని.. స్లిప్పర్స్ అస్సలు వాడొద్దని పేర్కొన్నారు.

పురుష ఉద్యోగుల విషయంలో పరిమితులు విధించిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా మహిళా ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉత్తర్వులు జారీ చేయటం విశేషం. ‘‘మహిళా ఉద్యోగులు ఎవరైనా తమకు ఇష్టమైన రీతిలో చీరలు.. సల్వార్లు.. ట్రౌజర్స్.. టీషర్ట్స్ వేసుకోవచ్చు. స్లిప్పర్స్ కూడా ధరించొచ్చు. కొట్టొచ్చినట్లు కనిపించే రంగులు.. వింత ఎంబ్రాయిడరీలు.. విపరీతమైన రాతలు రాసుండే టీషర్టులను మాత్రం ధరించకుండా జాగ్రత్తలు తీసుకోండి’’ అని పేర్కొన్నారు.

డ్రెస్ కోడ్ అన్నది పురుష.. మహిళ ఉద్యోగులకు వేర్వేరుగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. సర్కారీ ఉద్యోగుల డ్రెస్ కోడ్ కు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేయటానికి ముందు.. బిహార్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులు క్యాజువల్ వేర్ ధరించటాన్ని నిషేధించింది. 2018లో రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులు టీషర్టులు.. జీన్స్ ధరించరాదని పేర్కొంది. తమిళనాడు.. కర్నాటక రాష్ట్రాలు కూడా డ్రెస్ కోడ్ పై స్పష్టమైన నిబంధనల్ని జారీ చేసింది. అయితే.. వీరెవరూ చేయని రీతిలో మహారాష్ట్ర ప్రబుత్వం మాత్రం మగాళ్లకు మాత్రమే పరిమితులు పెట్టి.. ఆడోళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పటం షాకిస్తోంది.