Begin typing your search above and press return to search.

వైసీపీ ఓట్ బ్యాంక్ టార్గెట్.. టీడీపీలోకి మహాసేన రాజేష్ ...?

By:  Tupaki Desk   |   10 Feb 2023 1:25 PM GMT
వైసీపీ ఓట్ బ్యాంక్ టార్గెట్.. టీడీపీలోకి మహాసేన రాజేష్  ...?
X
గోదావరి జిల్లాల నుంచి అతి పెద్ద ముప్పు వైసీపీకి పొంచి ఉందా. ఆ దిశగా పరిణామాలు సాగుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఏపీలో గోదావరి జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఏ రాజకీయ పార్టీకైనా కష్టమే అని అంటున్నారు. ఇప్పటికే జనసేన వల్ల గోదావరి జిల్లాలలో వైసీపీకి దెబ్బ పడబోతోంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఇపుడు వైసీపీకి పెట్టని కోటగా కీలకమైన ఓటు బ్యాంక్ గా ఉన్న దళితులను కూడా అట్రాక్ట్ చేసే విధంగా తెలుగుదేశం పావులు కదుపుతోంది. గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున దళిత సామాజిక వర్గం ఉంది. చాలా నియోజకవర్గాలలో దళితులు ప్రభావితం చేస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయల్లో వారు అనుకున్నట్లుగా సగగడంలేదన్న అసంతృప్తి అయితే ఆ వర్గాలలో ఉంది అని అంటున్నారు.

ఇదిలా ఉండగా దళితులల్లో మంచి పేరు తెచ్చుకున్న యూ ట్యూబర్ గా జనాలకు బాగా తెలిసిన మహాసేన రాజేష్ ఇపుడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అన్న వార్తలు సంచలనంగా మారుతున్నాయి. ఇంతకీ ఈ రాజేష్ ఏంటి ఎవరు అంటే గోదావరి జిల్లాలలో మంచి పలుకుబడి దళితులలో ఆయన సంపాదించుకున్నారు.

ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత ప్రభుత్వ విధానాలతో ఆయన విభేదించి వేరు పడ్డారు. అయితే ఆయన మీద కేసులు పెట్టి మరీ అర్ధరాత్రి అరెస్టుల దాకా ప్రభుత్వ పెద్దలు కధ నడిపించారని చెబుతారు. దాంతో బాగా విసిగిన రాజేష్ జనసేనలో చేరాలనుకున్నారు. అయితే ఇపుడు మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఆయన ఈ మేరకు ఏపీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపారని అంటున్నారు దానికి ఆయన ఓకే చెప్పి చంద్రబాబుకు ఈ విషయం చేరవేశారని అంటున్నారు. బాబు కూడా మహాసేన రాజేష్ పార్టీలో చేరుతాను అంటే ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్ పెట్టుకున్నారు. ఈ టూర్ లోనే మహాసేన రాజేష్ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు.

ఆయనకు చంద్రబాబు కీలకమైన బాధ్యతలు కూడా అప్పగిస్తారు అని అంటున్నారు. సోషల్ మీడియా వింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయనకు ఆ విభాగమే అప్పగిస్తారు అని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయాలని మహసేన రాజేష్ భావిస్తున్నారుట. పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని అంటున్నారు.

వైసీపీకి దళిత ఓటు బ్యాంక్ పెట్టని కోట. కాంగ్రెస్ నుంచి దాన్ని వారసత్వంగా తెచ్చుకుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ వెనక ఈ కీలక ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి ఓట్ బ్యాంక్ ని కొల్లగొట్టాలని తెలుగుదేశం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇంతకాలం పార్టీలోని వారి చేతనే వైసీపీ మీద విమర్శలు చేయిస్తూ వచ్చింది. ఇపుడు దళిత పోరాటాల విషయంలో మంచి అవగాహన ఉన్న మహాసేన రాజేష్ లాంటి వారిని కనుక తమ వైపు ఉంచుకుంటే కచ్చితంగా ఆ వర్గాలు టర్న్ అవుతాయని తెలుగుదేశం భావిస్తోంది. ఈ పరిణామాలు అయితే కచ్చితంగా వైసీపీకి మింగుడుపడనివే అంటున్నారు. మరి దీనికి కౌంటర్ ప్లాన్ ఏమి ఆలోచిస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.