Begin typing your search above and press return to search.

ఏపీలో హామీ లేని ఉపాధి !

By:  Tupaki Desk   |   13 May 2022 11:30 PM GMT
ఏపీలో హామీ లేని ఉపాధి !
X
వివిధ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న జ‌గ‌న్ సర్కారు కు మ‌రో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఉపాధి పేరిట నిధుల విడుద‌ల లేక‌పోవ‌డమే సిస‌లు స‌మ‌స్య‌కు కార‌ణం. ఇందుకు కేంద్రానిదే త‌ప్పిదం అని రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రావ‌నిలో అమ‌లు అవుతున్న మ‌హాత్మా గాంధీ ఉపాధి హామీ ప‌థ‌కం కింద చెల్లించాల్సిన బ‌కాయిలు విలువ ఎంతో తెలుసా? అక్ష‌రాలు ఎనిమిది వంద‌ల కోట్లు. కూలి చేసుకుని బ‌తికే కుటుంబాలు మూడు, నాలుగు వారాలుగా డ‌బ్బులు అంద‌క ల‌బోదిబోమంటున్నాయి అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం బిల్లుల విడుద‌ల‌కు మొగ్గు చూప‌డం లేదు. వాస్త‌వానికి ఉపాధి హామీ ప‌థ‌కం నిధులు మ‌ళ్లించేందుకు కేంద్రం ఒప్పుకోవ‌డం లేదు.

ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న పనుల కార‌ణంగా ఇప్ప‌టికీ గ్రామాల్లో కొన్ని కుటుంబాల‌కు తిన‌డానికి తిండి దొరుకుతోంది. అదేవిధంగా కొన్ని కరువు ప్రాంతాల్లో వ‌ల‌స‌లు సైతం కాస్తో కూస్తో త‌గ్గాయి అంటే అదంతా ఈ ప‌థ‌కం పుణ్య‌మేన‌ని సంబంధిత కార్మిక వ‌ర్గాలు చెబుతున్నాయి. వేస‌విలో ప‌నిచేసే కూలీల‌కు వేత‌నంతో పాటు భృతి అందేది. ఇప్పుడు ఏవీ అంద‌డం లేదు.

గ‌త ఏడాది స‌గ‌టు 216 రూపాయ‌ల 17 పైస‌లు చొప్పున రోజుకు కూలీ వ‌స్తే, ఈ ఏడాది స‌గ‌టున ఒక రోజుకు 187 రూపాయ‌ల 63 పైస‌లు చొప్పున కూలి వ‌స్తోంది. గ‌తంలో పోలిస్తే ఈ మొత్తం చాలా అంటే చాలా త‌క్కువ. వేత‌నంతో పాటు భృతి ఉంటే వేస‌విలో రెండు పూట‌లా ప‌ని చేయించినా కూడా త‌మ‌కు సంతృప్తిక‌రంగా ఉంటుంద‌ని కొంద‌రు కూలీలు వాపోతున్నారు.

వాస్త‌వానికి మ‌హాత్మా గాంధీ ఉపాధి హామీ ప‌థ‌కంలో చెరువు ప‌నులు, రోడ్లు వేయ‌డం, ఇంకా కొంత మేర ప్ర‌భుత్వ ఆస్తుల‌కు సంబంధించి మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. వేస‌విలో వీరికి కాస్త ప‌నులు త‌క్కువే ఉంటాయి. క‌నుక వేత‌నాలు పెద్ద‌గా రావు. నాలుగు వ‌ర్షాలు ప‌డితే గ్రామాల్లో వ్య‌వ‌సాయ ప‌నులు ఊపందుకుంటాయి. అప్పుడు కూలీలు నాలుగు వంద‌ల నుంచి ఏడు వంద‌ల వ‌ర‌కూ డిమాండ్ మేర‌కు ద‌క్కించుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. బిల్లు బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో త‌మ‌కు ఇబ్బందిగా ఉంద‌ని కూలీలు వాపోతున్నారు. మ‌రోవైపు ఉపాధి నిధుల‌లో కొన్ని ప్ర‌భుత్వం మ‌ళ్లింపుచేసింద‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి.

అదేవిధంగా కేంద్రమే కాదు స్థానిక ప్ర‌భుత్వాల నుంచి కూడా ఉపాధి ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌పై కొంత ఒత్తిడి ఉంటోంద‌ని, దీంతో ప‌నులు వేగంగా చేయాల‌న్న త‌లంపుతో నాణ్య‌త‌కు తిలోద‌కాలు ఇచ్చిన వైనాలూ ఉన్నాయి అని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఉపాధి కూలీలు తామంతా రోడ్డున ప‌డ‌క‌ముందే ఆదుకోవాల‌ని కోరుతున్నారు.