Begin typing your search above and press return to search.

అసలు గాంధీ మనమడికి ఎంత కష్టం

By:  Tupaki Desk   |   15 May 2016 3:58 PM GMT
అసలు గాంధీ మనమడికి ఎంత కష్టం
X
చీలికలు పీలికలుగా ఉంటూ.. మతం.. ప్రాంతం..కులం.. వర్గం అంటూ ఎవరి అజెండా వారిదన్నట్లుగా ఉన్న భారతజాతిని ఒకచోటికి చేర్చి.. స్వాతంత్ర్య సంగ్రామానికి జాతిని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన ధీశాలి జాతిపిత గాంధీగా చెప్పుకోవాలి. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ ఉన్న భారతాన్ని ఏకం చేసిన మొనగాడిగా ఆయన్ను చెప్పాలి. సమాచార.. ప్రసారాలు అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో అందరికి ఒకే మాటకు కట్టుబడి ఉండేలా చేయటం ఆయన సక్సెస్ అయిన తీరు ఇప్పటికి విస్మయంగా మారతుందని చెప్పాలి. దేశాన్ని ఒకే తాటికి తెచ్చిన ఆయన ఫ్యామిలీలో తాజా పరిస్థితులు చూసినప్పుడు అయ్యో అనిపించక మానదు.

దేశాన్ని ఏకం చేసిన ఇంట్లో.. ఈ రోజున గాంధీ మనమడి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పాలి. కుటుంబ విలువల గురించి పదే పదే ప్రస్తావించిన గాంధీ ఫ్యామిలీలో ఈ రోజు అవే లోపించటానికి మించిన మహా విషాదం మరింకేం ఉంటుంది. గాంధీ మనమడి తాజా దుస్థితి గురించిన వార్త దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించటమే కాదు.. అదో చర్చనీయాంశంగా మారటం గమనార్హం.

87 ఏళ్ల గాంధీ మనమడు కణ్ణూభాయ్ రామ్ దాస్.. ఆయన సతీమణి శివలక్ష్మీ ఇప్పుడు ఒక ఓల్డేజ్ హోంలో కాలం వెళ్ల దీస్తున్నారు. అమరికాలో ఉన్నత చదువుతు చదివి.. వివిధ సంస్థల్లో పని చేసిన వారిద్దరూ.. జీవిత చరమాంకంలో తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు 2014లో ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే.. అయిన వాళ్లు పట్టించుకోకపోవటంతో తాతకు చెందిన సబర్మతి ఆశ్రమంలో కొంతకాలం గడిపిన వారు.. ఆ తర్వాత ఒక్కోఆశ్రమం మారుతూ ప్రస్తుతం ఢిల్లీలోని గురు విశ్రమ్ ఓల్డేజ్ హోమ్ లోని ఒక చిన్న గదికి మారారు. అయినవాళ్లతో కలిసి ఉందామని ఆశ పడ్డ ఆ వృద్ధ దంపతులు ఈ రోజు అందరికి దూరంగా ఎవరికి పట్టనట్లుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది. జాతిపిత అసలు మనమడికి ఎంత కష్టం.. ఎంత కష్టమో కదూ..?