Begin typing your search above and press return to search.

గాంధీ మనమడు ఎంతలా ఫైర్ అయ్యారంటే..

By:  Tupaki Desk   |   15 Jan 2017 8:11 AM GMT
గాంధీ మనమడు ఎంతలా ఫైర్ అయ్యారంటే..
X
దేశంలో ఇప్పటివరకూ ఎంతోమంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చినా ఎవరూ చేయని సాహసాన్ని ప్రధాని మోడీ చేశారని చెప్పాలి. జాతిపిత మహాత్మా గాంధీ ఉండే ఏ అంశాన్ని ఏ రాజకీయ నేత టచ్ చేయటానికి సాహసించలేదు. కానీ.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ క్యాలెండర్ మీద జాతిపిత గాంధీ బొమ్మను తీసేసి.. తన ఫోటోను వేసుకునేలా చేసుకున్నారన్న విమర్శలు ఆయన్ను చుట్టు ముట్టిన సంగతి తెలిసిందే.వాస్తవానికి ఖాదీ విషయంలో మోడీ చేసిందేమీ లేదు. కానీ.. ఖాదీ రంగానికి చెందిన క్యాలెండర్ పై జాతిపిత బొమ్మను ఎత్తేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేళ.. జాతిపిత మనమడు తుషార్ గాంధీ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పరుష వ్యాఖ్యలు చేశారు.

చేతిలో చరఖా.. మనసులో గాడ్సే.. టీవీలలో జోకర్ ని ‘జోకర్’ అని పిలవటంలో తప్పు లేదంటూ మండిపడ్డారు. బాపూజీ బకింగ్ హోమ్ ప్యాలెస్ కు వెళ్లేటప్పుడు కూడా ఖద్దరు ధరించే వెళ్లారు తప్పించి..రూ.10లక్షల విలువ చేసే సూట్ వేసుకొని వెళ్లలేదంటూ మోడీపై ఫైర్ అయ్యారు. ఖాదీగ్రామీణ పరిశ్రమల కమిషన్ ను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ రూ.10లక్షలు విలువైన సూట్ ధరించిన వైనాన్ని గుర్తు చేస్తూ.. ‘‘తొలుత రూ.2వేల నోటు మీద బాపూజీ అదృశ్యమయ్యారు. ఇప్పుడు కేవీఐసీ క్యాలెండర్ నుంచి మాయమయ్యారు. అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో నలిగే నోట్ల మీద ఉంచేకంటే.. అసలు బాపూజీ ఫోటోను పూర్తిగా నోట్ల మీద నుంచి తీసేయండి’’ అని వ్యాఖ్యానించారు. గాంధీ బొమ్మను టచ్ చేసి.. లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నమోడీ.. జాతిపిత మనమడి మాటలకు ఎలా బదులిస్తారో చూడాలి.