Begin typing your search above and press return to search.

గాంధీజీ జీవితంలో ఈయ‌న‌దే కీల‌క‌పాత్ర‌!

By:  Tupaki Desk   |   2 Oct 2022 6:30 AM GMT
గాంధీజీ జీవితంలో ఈయ‌న‌దే కీల‌క‌పాత్ర‌!
X
భార‌త జాతిపిత గాంధీజీ జ‌న్మ‌దినం అక్టోబ‌ర్ 2. గుజ‌రాత్‌లోని పోరు బంద‌రులో 1869లో జ‌న్మించిన గాంధీజీ ఇంతై.. ఇంతితై.. వ‌టుడింతై అన్న‌ట్టు ర‌వి అస్త‌మించ‌ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని త‌న పోరాటంతో దేశం నుంచి త‌రిమికొట్టారు. ఒక్క బొట్టు కూడా ర‌క్తం చిందించ‌కుండానే పూర్తిగా స‌త్యాగ్ర‌హం, స‌హాయ నిరాక‌ర‌ణ‌, అహింస అనేవాటినే ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఫాద‌ర్ ఆఫ్ ద నేష‌న్‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు.

కాగా ప్ర‌తి మ‌నిషి జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పే వారు ఎవ‌రో ఒక‌రో ఉంటారు. అలాగే గాంధీజీ జీవితంలోనూ ఒక‌రు ఉన్నారు. మ‌హాత్మాగాంధీ కుటుంబానికి ఆప్తుడైన మావ్జీ ద‌వే అనే ఆయ‌న గాంధీజీని విదేశాల‌కు పంపించి బారిష్ట‌ర్ కోర్సు (లా) చ‌దివించ‌మ‌ని గాంధీజీ తండ్రి క‌ర‌మ్ చంద్ కి స‌ల‌హా ఇచ్చాడు.

అయితే త‌న కుమారుడిని విదేశాల‌కు పంపడానికి ముఖ్యంగా ఇంగ్లండ్ పంప‌డానికి గాంధీజీ మాతృమూర్తి పుత్లీబాయి సుతారామూ అంగీక‌రించ‌లేదు. విదేశాల‌కు వెళ్లే మద్యపానం, ధూమ‌పానం, అమ్మాయిల‌తో చెడు తిరుగుళ్లు, మాంసాహారం వంటివి అల‌వాటు అవుతాయ‌ని, త‌న కుమారుడు భార‌తీయ సంప్ర‌దాయాల‌కు దూర‌మై పోతాడ‌ని భావించి విదేశాల‌కు పంప‌డానికి పుత్లీబాయి ఇష్ట‌ప‌డ‌లేదు.

అయితే ఒక సాధువు పుత్లీబాయి మ‌న‌సు మార్చారు. గాంధీజీని విదేశాల‌కు పంపాల‌ని ఆయ‌న సూచించారు. ఎలాంటి చెడ్డ అల‌వాట్లు చేసుకోన‌ని మాట తీసుకోమ్మ‌ని ఆమెకు సూచించారు. దీనికి పుత్లీబాయి అంగీక‌రించారు. దీంతో మ‌ద్యం తాగ‌న‌ని, ధూమ‌పానానికి దూరంగా ఉంటాన‌ని, మాంసాహారం తిన‌న‌ని, ప‌రాయి స్త్రీల‌ను త‌ల్లిలాగా, సోద‌రిలా భావిస్తాన‌ని గాంధీజీ త‌న త‌ల్లికి మాటిచ్చారు.

దీంతో పుత్లీబాయి త‌న కుమారుడిని ఇంగ్లండ్‌లో బారిష్ట‌ర్ చ‌ద‌వ‌డానికి అంగీక‌రించారు. దీంతో త‌న పెద‌నాన్న చేసిన ఆర్థిక సాయంతో గాంధీజీ 1888 సెప్టెంబ‌ర్లో బారిష్ట‌ర్ చ‌ద‌వ‌డానికి ఇంగ్లండ్ వెళ్లారు. అక్క‌డ బారిష్ట‌ర్ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికాకు వెళ్లి లాయ‌ర్‌గా స్థిర‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న త‌ల్లికి ఇచ్చిన మాట‌కు భంగం క‌ల‌గ‌కుండా వ్య‌వ‌హ‌రించారు. మాంసం తిన‌కుండా, మ‌ద్యం తాగ‌కుండా, ప‌రాయి స్త్రీల‌లో త‌ల్లిని, సోద‌రిని చూసుకుంటూ జీవించారు.

ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటే ఆత్మ‌విశ్వాసం ఇనుమ‌డిస్తుంద‌ని గాంధీజీ బ‌లంగా న‌మ్మేవారు. ఎదుటి వ్య‌క్తిలో ఏ మార్పు అయితే మ‌నం కోరుకుంటామో అదే మార్పు ముందు మ‌న జీవితంలో రావాల‌ని ఆయ‌న చెప్పేవారు. అందుకే ఆయ‌న ఎవ‌రికైనా ఏదైనా చెప్పే ముందు.. ముందు నువ్వు ఆచ‌రించి చూపు అని చెప్పేవారు. ఇలా ఏదైనా ఆయ‌న ఆచ‌రించి చూపాకే మిగిలిన‌వారికి చెప్పేవారు.