Begin typing your search above and press return to search.

టీవీ 9లో ర‌వి ప్ర‌కాశ్ ఇక క‌నిపించ‌రంతే!

By:  Tupaki Desk   |   10 May 2019 1:02 PM GMT
టీవీ 9లో ర‌వి ప్ర‌కాశ్ ఇక క‌నిపించ‌రంతే!
X
రెండు రోజులుగా పెను సంచ‌ల‌నం క‌లిగించిన టీవీ 9 విష‌యంలో ఇప్పుడు స‌రికొత్త నిర్ణ‌యాలే కాకుండా సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు కూడా వెలువ‌డ్డాయి. టీవీ 9ను స్థాపించ‌డంతో పాటు ఆ సంస్థ‌కు ఏకంగా 15 ఏళ్ల పాటు సీఈఓగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు టీవీ 9 మొత్తానికి హోల్ సోల్ గా కొన‌సాగిన ర‌విప్ర‌కాశ్ ను ఆ సంస్థ నుంచి ఏకంగా గెంటేశారు. టీవీ 9 అంటే ర‌వి ప్ర‌కాశ్... ర‌వి ప్ర‌కాశ్ అంటే టీవీ 9 అని ఇప్ప‌టిదాకా వ్య‌వ‌హారం సాగినా.... ఇక‌పై టీవీ 9 తెర‌పై ర‌వి ప్ర‌కాశ్ క‌నిపించ‌రు. ఈ మేర‌కు టీవీ 9 కొత్త యాజ‌మాన్యం అలంద మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. టీవీ 9 సీఈఓ ప‌ద‌వి నుంచి ర‌వి ప్ర‌కాశ్ ను, సీఓఓగా ఉన్న మూర్తిని సంస్థ నుంచి తొల‌గిస్తున్నట్లు కాసేప‌టి క్రితం హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అలంద మీడియా డైరెక్ట‌ర్ సాంబ‌శివ‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఇక‌పై ర‌వి ప్ర‌కాశ్ తో టీవీ 9కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని, టీవీ 9 కు సంబంధించి ర‌వి ప్ర‌కాశ్ తో నెరిపే ఎలాంటి వ్య‌వ‌హారాల‌కు తాము బాధ్య‌త వ‌హించ‌బోమ‌ని కూడా ఆయ‌న విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ర‌వి ప్ర‌కాశ్ ను సంస్థ నుంచి ఏకంగా గెంటేసినంత ప‌నైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. టీవీ 9 సీఈఓ ప‌దవి నుంచి ర‌వి ప్ర‌కాశ్ ను ఈ నెల 8న‌నే తొల‌గించామ‌ని కూడా సాంబ‌శివ‌రావు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ర‌వి ప్ర‌కాశ్, మూర్తి స్థానాల్లో కొత్త వ్య‌క్తుల‌ను నియ‌మిస్తున్న‌ట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ర‌వి ప్ర‌కాశ్ ప్లేస్ లో మ‌హేంద్ర మిశ్రాను, మూర్తి స్థానంలో గొట్టిపాటి సింగారావును నియ‌మిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించేశారు. ఇక టీవీ 9 యాజ‌మాన్య మార్పిడికి సంబంధించిన క్లారిటీ ఇచ్చిన సాంబ‌శివ‌రావు... అందులోనూ మూర్తితో క‌లిసి ర‌వి ప్ర‌కాశ్ త‌మ‌ను ఎంత‌మేర ఇబ్బందుల‌కు గురి చేశార‌న్న విష‌యాన్ని ఏక‌రువు పెట్టారు.

9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటాలను ఏబీసీఎల్‌ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో ర‌వి ప్ర‌కాశ్ బృందం చాలా అవరోధాలు సృష్టించింద‌ని, సంస్థలో 8శాతం వాటా ఉన్న వాళ్లు సంస్థ‌నే నియంత్రించేలా య‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్‌, మూర్తి అడ్డుపడ్డారని ఆరోపించారు. సంస్థ వాటాల విక్ర‌యం వాటాదార్లందరి అభిప్రాయం మేరకే తీసుకున్నామ‌ని... రవిప్రకాశ్‌ను కూడా అంద‌రి అభిప్రాయాల మేర‌కే తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు. తన సంతకాన్ని రవి ప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని స్పష్టం చేశారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు ఆయ‌న‌ వెల్లడించారు. రవి ప్రకాశ్‌తో పాటు మిగతా వారికి సంస్థ‌లో ఇప్ప‌టికీ 9.5 శాతం వాటాలు ఉన్నాయని, షేర్‌హోల్డర్‌గా రవిప్రకాశ్‌ సమావేశాలకు హజరుకావచ్చని ఆయ‌న తెలిపారు.