Begin typing your search above and press return to search.

రాజకీయ మెడపై 'కత్తి' మహేష్

By:  Tupaki Desk   |   11 July 2018 1:56 AM GMT
రాజకీయ మెడపై కత్తి మహేష్
X
కత్తి మహేష్........ సినీ విశ్లేషకుడు...ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న కత్తి మహేష్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఆయన తన నోరు పారేసుకుని ఊరికి దూరమయ్యారు. దళితుడైన కత్తి మహేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి చిత్తూరు జిల్లా నుంచి శాసనసభకు కాని, లోక్ సభకు కాని పోటి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన పలువురి మద్దత్తును కూడగట్టుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తో కత్తి మహేష్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

గతంలో ఆయన జనసేన పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ ను విమర్శించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అప్పట్లో కత్తి మహేష్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత తాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కత్తి మహేష్ ప్రకటించారు. ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. అనవసరపు ప్రకటనలు - ఒక మతం వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం కత్తి మహేష్ కు ఇబ్బందులు తీసుకువస్తోంది. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిని విమర్శించి కష్టాలలో పడ్డారు మహేష్. దీంతో కత్తి మహేష్ పై హిందూ సంస్ధలు - మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆయనపై తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ విధించింది. ఇక్కడి పోలీసులు కత్తి మహేష్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. ఈ తీవ్ర పరిణామంతో కత్తి మహేష్ రాజకీయ జీవితానికి కూడా తెర పడినట్లు అయ్యింది. ఆయన ఏ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగాలనుకున్నా తలుపులు మూసేసినట్లే. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తెలిసి తెలిసి ఓ మతం వారి ఓట్లను చేజార్చుకోదు. కత్తి మహేష్ ఓ మతానికి చెందిన దైవాన్ని దూషించడంతో ఆ మతం వారు కత్తి మహేష్ ను, ఆయనకు టిక్కట్టు ఇచ్చిన రాజకీయ పార్టీని వెలి వేసినంత పని చేస్తారు. దీంతో ఆయనకు ఏ రాజకీయ పార్టీ ఆహ్వానం పలకదు. అంటే రాజకీయంగా తన సమాధిని తానే నిర్మించుకున్నారు కత్తి మహేష్. అందుకే పెద్దలు నోరు అదుపులో ఉంచుకోవాలని ఏనాడో హెచ్చరించారు.