Begin typing your search above and press return to search.

సీఎంగా పవన్.. 'కత్తి' చూపిన మూడు దారులు

By:  Tupaki Desk   |   23 Jun 2019 2:24 PM GMT
సీఎంగా పవన్.. కత్తి చూపిన మూడు దారులు
X
సినీ క్రిటిక్ గా కొనసాగుతున్న కత్తి మహేశ్.. బిగ్ బాస్ పుణ్యమా అని ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చేసింత పనైంది. తనకు వచ్చిన పాపులారిటీతో తనదైన శైలిలో రెచ్చిపోయిన కత్తి మహేశ్ చాలా మందికి చుక్కలు చూపించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అయితే కత్తి మహేశ్ పెద్ద తలనొప్పిగానే మారాడన్న వాదనలూ వినిపించాయి. ఇదంతా తెలిసిన కథే అయినా... ఇప్పుడు తాను అభిమానించే వైసీపీ ఏపీలో అధికార పగ్గాలు చేపట్టడంతో కత్తి మహేశ్ మరింతగా పొలిటికల్ సెటైర్లు సంధిస్తున్నారు. నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పై సెటైర్లు సంధిస్తున్న కత్తి మహేశ్ తాజాగా పవన్ ను టార్గెట్ చేశారు. అయితే ఈ టార్గెట్ ఏదో అలా సాగిపోయిందిలే అనడానికి వీల్లేదు. పవన్ సీఎం కావాలనుకుంటే ఏం చేయాలన్న విషయాలను ప్రస్తావిస్తూ కత్తి మహేశ్ తన ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ ను పెట్టారు. చదవడానికి కాస్తంత లెంగ్తీగానే అనిపించినా... ఈ పోస్ట్ లో పవన్ ను కత్తి మహేశ్ చెడుగుడు ఆడుకున్నారని చెప్పక తప్పదు. పవన్ సీఎం కావాలంటే... ఆయన ముందు మూడు మార్గాలున్నాయని చెప్పిన కత్తి మహేశ్... అవేంటన్న వివరాలను కూడా తనదైన స్టైల్లో చాలా స్పష్టంగానే చెప్పారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కత్తి మహేశ్ పోస్ట్ ఈ కింది విధంగా సాగింది. ఆ పోస్ట్ యథాతథంగా ఇలా ఉంది.

‘‘నాకన్నా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ కి ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో పవన్ గెలవలేదని, మాములుగా తాగే రెండుపెగ్గులకి మరో రెండు కలిపికొట్టి నా విషాదాన్ని మిత్రులతో పంచుకున్నాను. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద, జనసేన పార్టీ మీద బెంగతో చచ్చిపోతున్నాను. ఏంచేస్తే 2024 నాటికి పార్టీకి,పవన్ కి రాజకీయపునర్జీవం వస్తుంది అనే విషయంపై నాకున్న మూడు దారుల స్ట్రాటజీ ఇక్కడ పెడుతున్నాను.

1.మొదటి దారి : తెలుగుదేశం పార్టీ ఎలాగూ కనుమారుగైపోతొంది గనక, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే, జనసేన గ్రామస్థాయి, మండలస్థాయి,జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుతో బలపడి. మానవవనరుల ఏర్పాటు చేసుకోవాలి. క్యాడర్ నిర్మాణం జరగాలి. జీరో బడ్జెట్ బెస్ట్ పాలిటిక్స్ అంటున్నారుగనక ప్రజల నుంచీ సానుభూతిపరుల నుంచీ తగినంత ఆర్థికవనరులు జమచేసుకోవాలి. కాపు ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాధ్ర, రాయలసీమల్లోకూడా ఫోకస్ పెట్టాలి. కనీసం 50-60 నియోజకవర్గాలలో లీడర్షిప్ ని గుర్తించి,ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాల దిశగా పనిచేసేలా చెయ్యాలి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా,అమలు సరిగ్గా కాకపోయినా,అవినీతి జరిగినా లోకల్ గా ప్రశ్నించి ఉద్యమాలు చేసే స్థాయిలో వీళ్ళు ఉంటే, ఆటోమేటిక్ గా జనసేన నుంచీ ఎమ్మెల్యేలుగా వీళ్ళే ప్రాజెక్ట్ అవుతారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీలైనన్ని సార్లు ఈ నియోజకవర్గాలను విజిట్ చేస్తూ, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు సమీక్షలు చేస్తే చాలు.

2.రెండోదారి:బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి, వాళ్ళు ప్రత్యామ్నాయం గా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ లో ట్రైచేస్తున్నారు. కానీ ఆపార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. జనసేనకు బీజేపీ లో విలీనం చేసేసి,పవన్ కళ్యాణ్ బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ధిక,మానవవనరుల గురించి ఆలోచన అవసరం లేదు. ఘర్షణ,పోరాట దీక్షలు అవసరం లేదు. ఈజీగా లైఫ్ లో సక్సెస్ఫుల్ రాజకీయనాయకుడు అయిపోతాడు. అదృష్టం వారిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోయినా ఎదో ఒక రాష్ట్రానికి గవర్నరో - దేశానికి ఉపరాష్ట్రపతో అయిపోతాడు.

3.మూడోదారి: చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. తెలుగుదేశం ఉంటుందో ఊడుతుందో తెలీదు. కమ్మలు తెప్పటగలేస్తున్నారు. కాపులు పార్టీని వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్ ను భవిష్యత్తుగా ఉహించుకోవడానికి పార్టీవాళ్లకే కష్టంగా ఉంది. ఈ టైంలో కాపుల్ని మల్లేసుకొచ్చే గొర్రెల కాపరిలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే...తెలుగుదేశం లో నెంబర్ టూ పొజిషన్ గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లకు - చంద్రబాబు పోయేనాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి..

ఇది నా ప్రణాళిక...ఏమంటారు?‘‘