Begin typing your search above and press return to search.

బరిలో దిగనందుకు భలే హ్యాపీగా ఉన్నాడే

By:  Tupaki Desk   |   10 Dec 2015 8:02 AM GMT
బరిలో దిగనందుకు భలే హ్యాపీగా ఉన్నాడే
X
ఎన్నికల బరిలో తాము కోరుకున్నట్లు పార్టీ టిక్కెట్టు దొరక్కపోతే.. పార్టీ మీద విరుచుకుపడటం.. పార్టీ కార్యాలయాల మీద దాడులకు పాల్పడటం.. నిరసన ప్రదర్శనలు చేయటం లాంటివి కామన్. కానీ.. ఇప్పుడు తెలంగాణలో పూర్తి రివర్స్ లో వ్యవహారాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారపక్షం తప్ప.. విపక్షాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. తాజాగా పోటీ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి నుంచి తప్పించుకున్న ఒక తెలంగాణ కాంగ్రెస్ నేత పండగ చేసుకుంటున్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాకపోతే ఆవేశంతో రగిలిపోయే దానికి భిన్నంగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

ఎన్నికల్లో పోటీ చేస్తే.. డబ్బులతోపాటు.. పేరుప్రతిష్ఠలు సైతం పోవటం తెలంగాణ విపక్షాలకు ఇప్పుడు ఒక అలవాటుగా మారింది. దీంతో.. అధికారపక్షంపై పోటీకి దిగటానికి పలువురు నేతలు ఇష్టపడటం లేదు. ఎవరివరకో ఎందుకు వరంగల్ ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్ ను బరిలోకి దింపాలని పార్టీ అధినాయకత్వం భావించినా.. ఆయన ససేమిరా అంటూ తప్పుకోవటం తెలిసిందే.

తాజాగా జరుగుతున్నస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అదిలాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వరరెడ్డిని బరిలోకి దింపాలని ప్రయత్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడన్న పేరున్న ఆయన్ను అదిలాబాద్ జిల్లా నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అయితే.. తనకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ ఆయన కోరుకున్నారు. బలమైన అభ్యర్థి దొరకని నేపథ్యంలో బరిలోకి దిగటం తప్పించి మరో మార్గం లేదని చెప్పటంతో ఏమీ చెప్పలేక నామినేషన్ పత్రాల్ని అయిష్టంగానే సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.

అయితే.. సరైన అభ్యర్థులు దొరక్క వరంగల్.. కరీంనగర్ లలో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో వెంటనే స్పందించిన మహేశ్వర్ రెడ్డి.. అదిలాబాద్ జిల్లాను కూడా ఆ రెండు జిల్లాల జాబితాలో చేర్చాలని ఒత్తిడి చేసి ఓకే అనిపించుకున్నాడట.

తనకు పోటీ చేసే అవకాశం తప్పిపోవటంతో ఆయనిప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడట. ఎన్నికల బరిలోకి దిగితే.. మూడు.. నాలుగు కోట్ల రూపాయిల ఖర్చుతో పాటు.. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని.. ఇప్పుడా బాధ పోయిందంటూ ఆయన పండుగ చేసుకుంటున్నారట. ఒకప్పుడు తమకు టిక్కెట్టు ఇవ్వలేదంటూ కారాలు మిరియాలు నూరే కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి.. ఇప్పుడిలా మారిపోయిందేనన్న విస్మయం వ్యక్తమవుతోంది.