Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో పాటు ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:14 PM GMT
కేసీఆర్‌ తో పాటు ఒకే ఒక్కడు
X
తెలంగాణ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తనతో పాటు ఒకే ఒక మంత్రికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనే మహమూద్ అలీ. గత ప్రభుత్వంలో - ఇప్పుడు కూడా ఆయనే డిప్యూటీ సీఎం. ఈసారి ప్రమాణ స్వీకారం తరువాత ఆయనకు హోం మంత్రి పదవి ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో అలీకి కేసీఆర్ ఎందుకంట ప్రాధాన్యం ఇస్తారు..? వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతటా చర్చనీయమవుతోంది.

మహమూద్ అలీతో కేసీఆర్‌ ది సుమారు రెండు దశాబ్దాల అనుబంధం. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ బయలుదేరిన నాటి నుంచి నేటి వరకు అలీ ఆయన వెన్నంటే ఉన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ ఎస్‌ ను స్థాపించినప్పుడు అందులో చేరారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటే వెళ్లేవారు. కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా.. ముందు ఆయన భుజానికి ఇమామ్-ఎ-జమీమ్ కట్టేది అలీనే.

నిత్యం తన బాగు కోరే - తన వెంట నడిచే అలీకి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షునిగా నియమించారు. దీంతో ఉద్యమానికి మద్దతుగా అలీ మైనారిటీలను కూడగట్టారు. కేసీఆర్ ఉద్యమ వ్యూహాలకు అనుగుణంగా ఆయనతో పాటు పనిచేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అవడం.. అలీ సేవలను గుర్తించి కేసీఆర్ ఆయన్ను డిప్యూటీ సీఎం చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి టీఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఈసారి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి పదవి కూడా ఆయనకు ఇచ్చారు.

ఇప్పటికీ ముస్లింలకు సంబంధించిన ఏ పర్వదినమైనా - లేక మైనారిటీలకు సంబంధించిన చర్చలైనా కేసీఆర్ మహమూద్ అలీ ఇంటికి వెళ్తుంటారు.కేసీఆర్ ఎప్పుడు వెళ్లినా.. ఆయన కోసం ఓ ప్రత్యేక గది ఎప్పుడూ ఉంటుంది. దాదాపు 18ఏళ్లుగా ఆ గదిని కేసీఆర్ కోసమే అలీ కేటాయించారంటే ఆయనపై అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ చిత్రపటం - ఒక టేబుల్ - ఓ కుర్చీ ఉండే ఆ గదిని ఆయన వచ్చినప్పుడు మాత్రమే తెరుస్తుంటారట.